హైదరాబాద్‌ లోని టోలిచౌకిలో యువకుడి దారుణ హత్య

by Malleboina Mahesh |

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారమాంట్ కాలనీలో షాకింగ్ ఘటన జరిగింది.

హైదరాబాద్‌ లోని టోలిచౌకిలో యువకుడి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, టోలిచౌకి పోలీస్ స్టేషన్ (Tolichawki Police Station) పరిధిలోని పారమాంట్ కాలనీలో షాకింగ్ ఘటన జరిగింది. మార్వ డెంటల్ హాస్పిటల్ సమీపంలో ఇర్ఫాన్ (24) అనే యువకుడిని బిలాల్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అసలు విషయం ఏమిటంటే, ఇర్ఫాన్ తమ్ముడు అదనాన్కు, నిందితుడు బిలాల్‌కు మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవను ఆపేందుకు ఇర్ఫాన్ ప్రయత్నించగా, ఆగ్రహించిన బిలాల్ నేరుగా ఇర్ఫాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగడం వల్ల ఇర్ఫాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా ఇటువంటి హింసాత్మక ఘటనలు, పాత కక్షలు లేదా చిన్నపాటి గొడవలు కూడా దారుణ హత్యలకు దారితీయడం నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ హత్యలు పెను ప్రశ్నలు రేపుతున్నాయి. ఈ తాజా కేసులో, టోలిచౌకి పోలీసులు హంతకుడు బిలాల్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుడి నేపథ్యం గురించి పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాల నియంత్రణకు అధికారులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story