పంజాబ్‌లో బాలీవుడ్ తరహా యాక్షన్.. ఎన్ కౌంటర్‌లో ఖైదీ హతం

by Malleboina Mahesh |

పంజాబ్‌లో హోషియార్‌పూర్ ఆసుపత్రి వద్ద తప్పించుకునేందుకు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన ఖైదీ నసీబ్ సింగ్, పోలీసుల ఆత్మరక్షణ కాల్పుల్లో మరణించాడు.

పంజాబ్‌లో బాలీవుడ్ తరహా యాక్షన్.. ఎన్ కౌంటర్‌లో ఖైదీ హతం
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రి నుంచి తీసుకెళ్తున్న ఖైదీ తప్పించుకునేందుకు పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా.. బాలీవుడ్ సినిమా తరహా సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ సివిల్ ఆసుపత్రి వెలుపల ఒక ఖైదీ తప్పించుకునేందుకు ప్రయత్నించి, పోలీసుల ఆత్మరక్షణ కాల్పుల్లో (Self-Defense Firing) మరణించిన ఘోర ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హత్య, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి 7 కేసులలో నిందితుడిగా ఉంటూ హోషియార్‌పూర్ జైలులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ నసీబ్ సింగ్‌ను.. రొటీన్ వైద్య పరీక్షల నిమిత్తం నలుగురు పోలీసులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం తిరిగి జైలు వాహనం ఎక్కిస్తుండగా, నసీబ్ సింగ్ తప్పించుకోవడానికి ప్రణాళిక వేశాడు.

తన చేతులకు సంకెళ్లు ఉన్నప్పటికీ, ఎక్కడి నుంచో సమకూర్చుకున్న పదునైన కత్తితో తనను తీసుకెళ్తున్న సీనియర్ కానిస్టేబుల్ జస్‌దీప్ సింగ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కత్తితో పొడుస్తూ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌ను లాక్కోవడానికి నిందితుడు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య రోడ్డుపైనే బాలీవుడ్ సినిమా తరహాలో భయానక వీధి పోరాటం సాగింది. కానిస్టేబుల్ మొదట గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపినప్పటికీ లొంగకపోవడంతో, ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నసీబ్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ జస్‌దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ భయానక ఘటన తాలూకు సీసీటీవీ (CCTV) వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఖైదీకి కత్తి ఎలా దొరికిందనే కోణంలో దర్యాప్తు చేసేందుకు పంజాబ్ పోలీసులు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

Next Story