బైక్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

by Bhanu |   (  Updated:2025-07-05 16:21:45  IST  )

కారు బైకును ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

బైక్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, హాలియా: కారు బైకును ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా గురజాల గ్రామానికి చెందిన మోరం నాగేశ్వరరావు భార్య పిల్లలతో కలిసి తిరుమలగిరి (సాగర్) మండలం రంగుండ్ల లోని తమ స్నేహితుడు పాశం లక్ష్మీకాంత్ రెడ్డి ఇంటిలో జరిగిన అన్నప్రాసన కార్యక్రమానికి వచ్చారు.

కార్యక్రమం అనంతరం తిరిగి వెళుతుండగా కొత్తపల్లి గ్రామ సమీపంలోని సహకార సంఘ భవనం సమీపంలో జాతీయ రహదారిపై హాలియా నుండి సాగర్ వైపు అతివేగంగా వెళ్తున్న ఏపీ 39 డి 6614 నంబర్ గల కారు ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న నాగేశ్వరరావు (35) భార్య లక్ష్మి పార్వతి (30), కుమారుడు అభిరామ్ (2) లకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

కాగా తీవ్ర గాయాలైన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.

అతివేగమే ప్రమాదానికి కారణం...?

కొత్తపల్లి గ్రామ సమీపంలో జరిగిన కారు బైక్ డీ కొన్న ప్రమాదంలో అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. హాలియా నుండి వేగంగా సాగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో ఉండడమే కాక ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. క్షతగాత్రులను చూసి స్థానికులు చలించిపోయారు.


Next Story