Arrest: కోఠి కాల్పుల కేసులో పురోగతి.. హర్యానాలో ఒక నిందితుడు అరెస్ట్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ అబిడ్స్ ఏటీఎం వద్ద కేరళ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. గత మూడు నెలలుగా దోపిడీకి ప్లాన్ చేసిన ఈ యూపీ ముఠాలోని మరో నిందితుడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు

Arrest: కోఠి కాల్పుల కేసులో పురోగతి.. హర్యానాలో ఒక నిందితుడు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మహానగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠి (Koti) ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కేరళ (Kerala) వ్యాపారిపై కాల్పులు జరిపి నగదు దోచుకున్న కేసులో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Telangana Task Force Police) కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిని పోలీసులు హర్యానా (Haryana)లో చాకచక్యంగా పట్టుకున్నారు. అతడు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే, విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా గత 3 నెలల నుంచే ఈ భారీ దోపిడీకి ప్రణాళిక రచించినట్లుగా వెల్లడైంది. బాధితుడి కదలికలపై నిఘా ఉంచి, ఏ సమయంలో నగదు డిపాజిట్ చేస్తాడనే అంశంపై వీరు ముందే రెక్కీ నిర్వహించారు.

కాగా, కేరళకు చెందిన వస్త్ర వ్యాపారి రిన్షద్ (Rinshad), వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లి (Nampally)లో ఉంటున్నారు. జనవరి 31న ఉదయం సుమారు 7 గంటల సమయంలో కోఠిలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం వద్ద రూ.6 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా, దుండగులు అతడిపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ కాలికి తగలడంతో గాయపడిన రిన్షద్ నుంచి నగదు బ్యాగును, ఆయన స్కూటీని లాక్కొని నిందితులు పరారయ్యారు. అయితే, ఈ ముఠాకు హైదరాబాద్‌లో ఆశ్రయం కల్పించి, దోపిడీకి సహకరించిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story