Arrest: కోఠి ఎస్‌బీఐ కాల్పుల కేసు.. పాతబస్తీకి చెందిన ఒకరు అరెస్టు

by Kema Shiva Kumar |

కోఠి (Koti) ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Arrest: కోఠి ఎస్‌బీఐ కాల్పుల కేసు.. పాతబస్తీకి చెందిన ఒకరు అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: కోఠి (Koti) ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పాతబస్తీ (Old City)కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. జనవరి 31న కోఠి ఏటీఎం వద్ద నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యాపారి రిన్షద్‌ (Rinshad)పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి రూ.6 లక్షలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిపిన అనంతరం పరారైన నిందితులకు, ఈ పాతబస్తీ వ్యక్తి ఆశ్రయం కల్పించినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు తప్పించుకోవడానికి ఇతను సహకరించినట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు ఇతనిని అదుపులోకి తీసుకున్నారు.

విచారిస్తున్న సీసీఎస్ స్పెషల్ టీమ్

ప్రస్తుతం నగరం క్రైమ్ సెంట్రల్ స్టేషన్ (CCS) ప్రత్యేక బృందం అరెస్ట్ చేసిన వ్యక్తిని రహస్య ప్రదేశంలో విచారిస్తోంది. నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు..? కాల్పులకు వాడిన ఆయుధాలు ఎక్కడివి, దోచుకున్న నగదు ఎక్కడ ఉంది..? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

కాగా, కేరళకు చెందిన వస్త్ర వ్యాపారి రిన్షద్ జనవరి 31న నగదు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం వద్దకు రాగా, పక్కా ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు నిందితులు అతడి కాలిపై కాల్పులు జరిపి స్కూటీతో సహా నగదును అపహరించారు. నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద స్కూటీని వదిలివేసి, ఆపై పాతబస్తీ వైపు పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ మరియు సెల్ టవర్ డంపింగ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు, పాతబస్తీలో నిందితులు ఆశ్రయం పొందినట్లు క్లూ లభించింది. దీంతో ఈ అరెస్టు చోటుచేసుకుంది. ప్రధాన నిందితుల కోసం ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Next Story