ఆర్మీ మద్యం.. ఆ కిక్కే వేరప్పా..!

by Bhoopathi Nagaiah |

ఆర్మీ మందు.. ఈ మాట వింటే మద్యం ప్రియులకు ప్రాణం లేచివస్తుంది. ఒక్క పెగ్గు అయినా తాగాలని ఉవ్విళ్లు ఊగుతుంటారు.

ఆర్మీ మద్యం.. ఆ కిక్కే వేరప్పా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్మీ మందు.. ఈ మాట వింటే మద్యం ప్రియులకు ప్రాణం లేచివస్తుంది. ఒక్క పెగ్గు అయినా తాగాలని ఉవ్విళ్లు ఊగుతుంటారు. తెలిసిన ఆర్మీ ఉద్యోగులను, బంధువులను ఒక్క బాటిల్ అయినా ఇవ్వండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతుంటారు. అంతలా ఆరాటపెడుతుంది ఈ మందు. రక్షణ శాఖ ఉద్యోగులకే విక్రయించే ఈ మద్యం ఇటీవల బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా పట్టుబడుతుండటం పోలీసులను కలవర పెడుతుంది. తాజాగా ఏపీలో వందల కొద్ది ఆర్మీ మద్యం బాటిళ్లు అక్రమార్కుల వద్ద పట్టుబడటం కలకలం సృష్టించింది.

ఆర్మీ మద్యానికి ఎందుకంత డిమాండ్

భారత రక్షణ శాఖలో పని చేసే ఉద్యోగులకు మాత్రమే ఈ మద్యం లభిస్తుంది. సైనికులు, అధికారులు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు డిఫెన్స్ శాఖ ఈ మద్యాన్ని వారికి అతి తక్కువ ధరలకు అందిస్తుంది. అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా ఆర్మీ క్యాంటీన్ల నుంచి మద్యాన్ని అందిస్తుంది. రక్షణ శాఖకు నేరుగా మద్యం తయారీ కంపెనీ నుంచి సరఫరా అవుతుంది. అందుకే వీటిల్లో కల్తీ ఉండదు. పైగా సంవత్సరాల తరబడి మగ్గిన మద్యం ఉంటుంది. ఇలాంటి మద్యం ఎక్కువ కిక్కు ఇవ్వడంతోపాటు టెస్టీగానూ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా కచ్చా మందులా హానీ చేయదు. ధరల్లోనూ భారీ వ్యత్యాసం ఉంటుంది. బయటి మార్కెట్‌లో బీరు ధర రూ.180 నుంచి రూ.250 ఉండగా, ఆర్మీ క్యాంటీన్‌లో కేవలం రూ.58 నుంచి రూ.71 లు మాత్రమే ఉంటుంది. అదే విస్కీ ఫుల్ బాటిల్ బహిరంగ మార్కెట్‌లో రూ.2500 నుంచి 3 వేల వరకు ఉంటుంది. క్యాంటీన్‌లో వెయ్యి నుంచి 1400 రూపాయల వరకే లభిస్తుంది. ధరల్లోనూ తేడాలు ఉండటం, ఆర్మీ మద్యాన్ని తాగడం ఓ స్టేటస్‌గా భావిస్తుండటంతో బ్లాక్ మార్కెట్‌లో ఆ మందుకు భారీగా డిమాండ్ పెరిగింది.

క్యాంటీన్ల నుంచి బ్లాక్ మార్కెట్‌కు ఎలా..?

కేవలం ఆర్మీ వాళ్లకే విక్రయించే ఈ మద్యం బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభ్యమవుతుంది. ఇటీవల గాజువాక ఎక్సైజ్ పోలీసులు ఆ స్టేషన్ పరిధిలో దాడులు చేయగా భారీగా ఆర్మీ లిక్కర్ పట్టుబడింది. పది నెలల్లో 18 కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 338 లీటర్ల లిక్కర్‌, 12 లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత మద్యం బయటకు ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేసిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రిటైర్డ్ అయిన ఆర్మీ సిబ్బంది తమ ఇళ్లలో పని చేసే వారికి, పాలు పోసే వారికి డబ్బులకు బదులుగా మద్యం బాటిళ్లు ఇస్తున్నట్టు తేలింది. మరి కొంత మంది బెల్ట్ షాపుల నిర్వాహకులకు విక్రయిస్తునట్టు విచారణలో బయటపడింది. ఇలా మాజీ సైనిక ఉద్యోగు ల నుంచే ఆర్మీ మద్యం అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖాధికారులు గుర్తించారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న ఆర్మీ మాజీ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Next Story