భారీగా బయటపడ్డ అక్రమాస్తులు.. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-07 14:18:02  IST  )

ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ (ACB) పంజా విసిరింది.

భారీగా బయటపడ్డ అక్రమాస్తులు.. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ (ACB) పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఆమెపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పక్కా ఆధారాలతో దాడులు నిర్వహించిన అధికారులు, భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచే శాంతి నివాసం, ఆమెకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. సుమారు 10 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సోదాల్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు, ఇళ్లు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా. బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా అధికారులు సేకరించారు.

కోర్టుకు తరలింపు..

సోదాలు ముగిసిన అనంతరం, తాడేపల్లిలోని ఆమె నివాసం వద్దే శాంతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, రాత్రి వేళ ఆమెను ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. విచారణ నిమిత్తం ఆమెను రిమాండ్‌కు కోరనున్నట్లు సమాచారం. ఒక ఉన్నతస్థాయి అధికారి ఇలా అక్రమ ఆస్తుల కేసులో పట్టుబడటం దేవదాయ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. భక్తుల సొమ్మును, ఆలయ భూములను రక్షించాల్సిన అధికారిణి.. తన పదవిని అడ్డం పెట్టుకుని ఇంతలా అక్రమాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఏసీబీ ఆరా తీస్తోంది.

Next Story