- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి చిక్కిన 'అటవీ' తిమింగలాలు..
సర్కార్ కొలువులు చేస్తూ వచ్చే జీతం సరిపోవడం లేదో.. లేక విలాసవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ డబ్బులు కావాలనో..

దిశ, కొత్తగూడెం : సర్కార్ కొలువులు చేస్తూ వచ్చే జీతం సరిపోవడం లేదో.. లేక విలాసవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ డబ్బులు కావాలనో... వచ్చే జీతం కంటే ముడుపుల రూపంలో వచ్చే సొమ్ము ఎక్కువగా వస్తుందని ఆశ పడుతున్నారో ఏమో తెలియడం లేదు కానీ... ప్రభుత్వ శాఖలన్నిటిలో అవినీతి చాపకింద నీరులా ప్రవహిస్తోందని చెప్పక తప్పడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులు పై కొరడాలు ఝులిపిస్తున్న కానీ ఇంకా ఎక్కడో చోట అవినీతి జరుగుతూనే ఉంది.
జామాయిల్ కట్ చేసిన బిల్లుల విషయంలో కొత్తగూడెం ఫారెస్ట్ ప్లాంటేషన్ అధికారులు సదరు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ సందర్బంగా ఏసీబీ డీఎస్పీ రమేష్ పూర్తి వివరాలు వెల్లడించారు. టీఎఫ్డీసీ ప్లాంటేషన్ మేనేజర్, ఫారెస్టు రేంజ్ అధికారి తాడి రాజేందర్, పై అధికారి డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిలు ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి జామయిల్ కట్ చేసిన బిల్లులు చెల్లించేందుకు తమకు ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 32 వేల టన్నులు జామాయిల్ కట్ చేసినందుకు తొలివిడత తమకు 3 లక్షల 51 వేలు లంచం ఇస్తే తాము సంతకం చేస్తామని ఒత్తిడి చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ వారు అడిగిన డబ్బులు ఇవ్వలేక ఏసీబీని సంప్రదించి ఫిర్యాదు చేశారు. తనకు బిల్లు చేయాలంటే సదరు అధికారులు డిమాండ్ చేశారని చెప్పారు.
దీంతో ఏసీబీ అధికారులు సూచనల మేరకు సదరు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో శనివారం డబ్బులు ఇస్తానని చెప్పడంతో.. కొత్తగూడెం ఫారెస్ట్ సబ్ డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్ మరో ప్రైవేట్ వ్యక్తి చెన్నం గోపాలకృష్ణతో కలిసి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే సదరు కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణికి సంబంధం ఉన్నా కానీ ఆమె అక్కడ లేరని, పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉందని, భద్రత కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని ఆయన కోరారు. ఏసీబీ క్యూఆర్ కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించ బడుతుందని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.






