ఘోర ప్రమాదం: లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు స్పాట్ డెడ్

by Naga Rani Yarlagadda |

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది.

ఘోర ప్రమాదం: లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఒక అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక రోగిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి మండలం పరిధిలోకి రాగానే, రహదారి పక్కన ఆగి ఉన్న లారీని అంబులెన్స్ డ్రైవర్ గమనించకపోవడంతో అతివేగంతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో రోగితో పాటు వారి బంధువులు కూడా ఉన్నారు. మృతి చెందిన నలుగురు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story