ముడుపులు ముట్టనిదే ముందుకు కదలని ఫైలు.. ACB ఎంట్రీతో అంతా షాక్

by Gantepaka Srikanth |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరోగ్య శాఖలో అవినీతి వేళ్ళూనుకున్నది. ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, క్లినిక్లకు అనుమతులు ఇచ్చే విషయంలో భారీ మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయి.

ముడుపులు ముట్టనిదే ముందుకు కదలని ఫైలు.. ACB ఎంట్రీతో అంతా షాక్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరోగ్య శాఖలో అవినీతి వేళ్ళూనుకున్నది. ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, క్లినిక్లకు అనుమతులు ఇచ్చే విషయంలో భారీ మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు పాత ఆసుపత్రుల రెన్యువల్స్ విషయంలోనూ పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలను నిరోధించాల్సిన జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో మామూళ్లు వసూలు చేస్తున్న అధికారులు సిబ్బందితో చేతులు కలుపుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా ఒక క్లినిక్ రీఓపెనింగ్నకు సంబంధించి రూ.30 వేల లంచం తీసుకుంటూ జిల్లా మాస్ మీడియా అధికారి ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతున్నది. దీన్నిబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవుతున్నది.

అనుమతులకు, రెన్యువల్స్కు వసూళ్లు

కొత్తగా ప్రారంభించే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్, హాస్పిటల్, క్లినిక్స్... ఇలా రకరకాల పేర్లతో వైద్య సంస్థలను నెలకొల్పే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో ఆరోగ్యశాఖ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలు సహా ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన సదుపాయాలు అగ్నిమాపక పరికరాలు అవుట్ పేషంట్ ఇన్ పేషంట్ ఆపరేషన్ థియేటర్ లాబరేటరీ మెడికల్ వార్డు సౌకర్యాలు ప్రత్యేక గదులు ర్యాంపు సౌకర్యం మూత్రశాలలు ఇలా వివిధ సౌకర్యాలపై ఆరోగ్య శాఖ సిబ్బంది పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇస్తుంది. ఆసుపత్రుల నిర్వహణ చట్టం పరిమితులకు లోబడి ఆరోగ్యశాఖ అనుమతులు ఇవ్వాలి. ఇక్కడే ఉమ్మడి జిల్లాలోని ఆరోగ్యశాఖలో అధికారులు సిబ్బంది సౌకర్యాల లేమి చూపించి అనుమతులు నిరాకరించే పరిస్థితులను కలగజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి దీంతో నిర్వాహకులు ఎంతో కొంత చెప్పే స్థాయికి దిగుతున్నారు. అనుమతులతో పాటు రెన్యువల్స్ విషయంలో ఆరోగ్యశాఖ అధికారులు పెద్ద మొత్తంలో మామూలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆదిలాబాద్, మంచిర్యాలలో అధికం

కాగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలు పనిచేస్తున్నాయి. ఈ జిల్లాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు నర్సింగ్ హోమ్ హాస్పిటల్స్ క్లినిక్స్ కోసం నిర్వాహకులు పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకున్నారు. కొత్త వాటికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే నడుస్తున్న పాత ఆస్పత్రులకు రెన్యువల్స్ కోసం దరఖాస్తులు ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమర్పించారు. అయితే వెంటనే అనుమతులు ఇవ్వకుండా పెద్ద మొత్తంలో ప్రైవేటు ఆసుపత్రులు నర్సింగ్ హోమ్ ల దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి ఇదే జిల్లాలో ఇచ్చోడా, బోథ్, ఉట్నూర్ తదితర కేంద్రాల్లోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి మంచిర్యాల జిల్లాతో పాటు ఆ జిల్లాలోని లక్షేట్టిపేట బెల్లంపల్లి చెన్నూర్ దండేపల్లి తదితర ప్రాంతాల్లో భారీగా ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి.

ఈ రెండు జిల్లాల్లో భారీ మొత్తంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతుల కోసం డబ్బులు వసూళ్లు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో సైతం ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వహణ కోసం దరఖాస్తులు చేసుకున్నారు అనుమతుల పేరిట ఆరోగ్యశాఖ తనిఖీ బృందాలు నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఈ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాస్ మీడియా అధికారి రవిశంకర్ మూతబడిన ఓ క్లినిక్ మెడికల్ రీఓపెనింగ్ కోసం 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు ఈ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరోగ్యశాఖ వర్గాల్లో కలకలం రేపింది ఇలాంటి అక్రమ వసూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయని ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆస్పత్రుల నిర్వాహకులు కోరుతున్నారు.

Next Story