భర్త కంత్రీ.. భార్య జగత్ కంత్రీ.. వీళ్లది మామూలు స్కెచ్ కాదయ్యో!

by Prasad Jukanti |

ఈజీ మనీకోసం ఓ జంట చేసిన కంత్రీ ప్లాన్ ఎట్టకేలకు బెడిసి కొట్టింది.

భర్త కంత్రీ.. భార్య జగత్ కంత్రీ.. వీళ్లది మామూలు స్కెచ్ కాదయ్యో!
X

దిశ, డైనమిక్ బ్యూరో: డబ్బుల కోసం భార్య భర్తలు వేసిన ప్లాన్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. ఇన్సూరెన్స్ డబ్బుల (insurance fraud) కోసం అప్పటి వరకు అందరిని నమ్మించిన ఆ జంట చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. యూపీలో (Uttar Pradesh) జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‍గా మారింది. యూపీ రాజధాని లక్నోకు చెందిన రవిశంకర్ అనే వ్యక్తి 2012 డిసెంబర్‍లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి టర్మ్ పాలసీ తీసుకున్నాడు. అయితే 2023 ఏప్రిల్ 3వ తేదీన తన భర్త చనిపోయాడని రవి శంకర్ భార్య కేశ్ కుమారి అదే ఏడాది ఏప్రిల్ 21న బీమా డబ్బుల కోసం క్లెయిమ్ దాఖలు చేసింది. ఇందుకోసం బతికున్న తన భర్తను చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి (fake death certificate) క్లెయిమ్ ప్రాసెస్ కు ముందుకు వచ్చింది. ఆమె సమర్పించిన పత్రాల ఆధారంగా క్లెమ్ అంగీకరించిన సదరు బీమా సంస్థ అదే నెలలో ఆమె ఖాతాకు ఇన్సూరెన్స్ డబ్బులు రూ. 25 లక్షలు జమ చేసింది. అయితే ఆ తర్వాత జరిపిన అంతర్గత దర్యాప్తులో రవిశంకర్ బతికే ఉన్నాడని తేలడంతో ఇన్సూరెన్స్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని వెతుకుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు పోలీసుల కళ్లు కప్పి ఆ జంట తప్పించుకు తిరుగుతూనే ఉంది. ఎలాగోలా గత సోమవారం ఆ కిలాడీ జంటను అరెస్టు చేసిన పోలీసులు. వారిని విచారించగా నేరం అంగీకరించారు. ఇద్దరం కలిసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ నాటకం ఆడినట్లు అంగీకరించారు.

Next Story