విషాదంలోనూ మానవత్వం.. అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ..!

by Batti.Sumithra |   (  Updated:2026-03-28 06:16:25  IST  )

గుండాల మండలంలోని మాసాన్ పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విషాదంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబం మానవత్వం చాటుకుంది.

విషాదంలోనూ మానవత్వం.. అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ..!
X

దిశ, గుండాల : గుండాల మండలంలోని మాసాన్ పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విషాదంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబం మానవత్వం చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన బత్తిని హరీష్ గౌడ్ (24)అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి కొత్త జీవితం ప్రసాదించిన కుటుంబం ఆదర్శంగా నిలిచింది. హరీష్ గౌడ్ హైదరాబాదులో ఉప్పల్ లో నివసిస్తు మెట్రో షాపింగ్ మాల్ లో పని చేస్తున్నాడు. గత నాలుగు రోజుల క్రితం బైకు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మలక్ పేట యశోద హాస్పిటల్ తరలించారు.

ఐదు రోజులుగా ఐసీయూలో వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్యులు, జీవన్ దాన్ సంస్థ ప్రతినిధులు తల్లి తండ్రి బత్తిని ఎల్లయ్య, మహేశ్వరికి అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. అవయవాలను దానం చేయడానికి అంగీకరించడంతో వైద్యులు అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు మార్పిడి చేశారు. హరీష్ గౌడ్ అవయవాలు పలువురికి ప్రాణదారంగా మారాయి. కన్నీరు మున్నీరైన గ్రామం ఒకేఒక్క కొడుకు చేతికందిన కొడుకు మరణించాడని తల్లితండ్రుల శోకసంద్రంతో వారు ఏడ్చే తీరును గ్రామమంతా కన్నీరు పెట్టించాయి. విషాదాన్ని తట్టుకుని సమాజ హితాన్ని ముందుంచి అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లితండ్రులను మండల ప్రజలు అభినందించారు.

Next Story