పొలం వ‌ద్ద‌కు వెళ్లిన రైతు.. అనుమాన‌స్ప‌దంగా మృతి

by Ratna Kumari |   (  Updated:2026-05-20 13:15:49  IST  )

నిత్యం కుటుంబం కోసం కష్టపడే ఓ రైతు.. సాయంత్రం “పొలం చూసుకుని వస్తా” అంటూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి శవంగా కనిపించడంతో నల్లగొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

పొలం వ‌ద్ద‌కు వెళ్లిన రైతు.. అనుమాన‌స్ప‌దంగా మృతి
X

దిశ, కొడిమ్యాల : నిత్యం కుటుంబం కోసం కష్టపడే ఓ రైతు.. సాయంత్రం “పొలం చూసుకుని వస్తా” అంటూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి శవంగా కనిపించడంతో నల్లగొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామానికి చెందిన కొలపూరి సురేష్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కుటుంబ సభ్యులను కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సురేష్ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. “కొంతసేపు పొలం దగ్గర ఉన్నాడు. అనంత‌రం ఆవు పాలు పితికి ఇంటికి వస్తా” అని చెప్పి వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. మొదట కుటుంబ సభ్యులు అతను పొలం వద్దే ఉంటాడని భావించినా, బుధవారం ఉదయం పొలం సమీపంలో అతని మృతదేహం కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది.


అప్పటివరకు కుటుంబానికి అండగా ఉన్న సురేష్ ఇక లేడనే వార్తతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. చిన్న వయస్సులోనే కుటుంబాన్ని ఒంటరిగా చేసి వెళ్లిపోవడం గ్రామస్తులను కూడా కలచివేసింది. మృతదేహం పై నుదిటి పై, కుడికాలి వేళ్ల వద్ద గాయాలు కనిపించడంతో కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందుకున్న కొడిమ్యాల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కొడిమ్యాల ఎస్‌ఐ సందీప్ వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story