సూర్య‌ 'గ్యాంగ్' సినిమా త‌ర‌హాలో దోపిడి.. షాకైన పోలీసులు!

by Disha Web Desk 20 |
సూర్య‌ గ్యాంగ్ సినిమా త‌ర‌హాలో దోపిడి.. షాకైన పోలీసులు!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః నిజ జీవితంలో సినిమాను అనుకరించే ఉదాహ‌ర‌ణ‌లు చాలానే క‌నిపిస్తాయి. అలాగే, సూర్య కథానాయ‌కుడిగా తెర‌కెక్కిన‌ 'గ్యాంగ్' సినిమా, దాని మాతృక‌ 'స్పెష‌ల్ 26' పేరుతో హిందీలోని అక్ష‌య్ కుమార్ మూవీలా ఒక బృందం ప్ర‌భుత్వ అధికారుల వేషం వేసుకొని మోసానికి పాల్ప‌డ్డారు. నాటకీయమైన ఈ కేసులో, ఢిల్లీలోని ఏడుగురు వ్యక్తులు ముంబై పోలీసు అధికారులుగా నటిస్తూ ఢిల్లీలోని వెల్‌నెస్ సెంటర్‌ను దోచుకున్నారు. ఇందులో కాన్-మ్యాన్ల ముఠా C.B.I., ఇన్‌క‌మ్‌ట్యాక్స్‌ అధికారులుగా నటిస్తూ ప్రముఖ ధనిక వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను దోచుకుంటున్నారు. అయితే, తాజాగా ఈ నిందితులను ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో అరెస్టు చేశారు.

ముంబై పోలీసు అధికారులుగా నటిస్తూ వీళ్లు గ‌త‌వారం ముంబాయ్‌ నేతాజీ సుబాష్ ప్లేస్ కాంప్లెక్స్‌లోని సెంటర్ కార్యాలయంలోకి చొర‌బ‌డ్డారు. ఈ ఫేక్‌ రైడ్‌లో ఒక మహిళతో సహా నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అధికారుల వేషంలో వీళ్లు ఐదు గంటల పాటు దాడి చేసి రూ.5-7 లక్షలు దోచుకున్నారు. నగదుతో పాటు, ల్యాప్‌టాప్, 10 ఫోన్లు, బాధితుడి బ్యాంక్ పత్రాలను కూడా తీసుకుని పారిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితులతోపాటు కొందరు వ్యక్తులు కార్యాలయం బయట కాపలాగా ఉన్నారని ప్రాథమిక విచారణలో తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగనాని తెలిపారు.

ఈ కేసులో అరెస్టయిన ప్ర‌ధాన నిందితుడు, 29 ఏళ్ల ప్రశాంత్ కుమార్ పాటిల్, ఆరుగురు సహచరులతో క‌లిసి ఈ నేరానికి పాల్ప‌డిన‌ట్లు వెల్లడించాడు. వారిలో ఇద్దరు మహిళలు - జ్యోతి (30), నేహా (22) లను పోలీసులు రోహిణిలో అరెస్టు చేశారు. ఇక‌, ఇందులో ప్రమేయం ఉన్న 8 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేయ‌గా, వాళ్లు బాలీవుడ్ చిత్రం 'స్పెషల్ 26' నుండి ప్రేరణ పొందిన‌ట్లు వెల్లడించారు. ప్రశాంత్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉందని, అయితే నకిలీ కంపెనీలకు రుణాలు మంజూరు చేశారన్న ఆరోపణలపై భోపాల్ క్రైమ్ బ్రాంచ్ అతనిపై కేసు నమోదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. అప్పుడు ప్రశాంత్‌ను భోపాల్ జైలులో ఉంచారు, అక్కడ చీటింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సహ నిందితుడు మాజిద్‌ను కలిశాడు. వీరిద్ద‌రూ ఢిల్లీలో బాధితురాలిని దోచుకోవాలని పథకం వేశారు. ఇక‌, నిందితుల్లో ఒక‌రైన నేహా కంప్యూటర్ నిపుణురాలు కావ‌డంతో ఆమె ఈ బృందానికి నకిలీ పోలీసు ఐడిలు, పత్రాలను తయారు చేసిందని డిసిపి తెలిపారు.

Next Story

Most Viewed