ఏపీలో దారుణం.. 16 ఏళ్లకే డాన్ అవ్వాలని తల్లిని హత్య చేసిన కొడుకు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-16 06:08:34  IST  )

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మాఫియా డాన్ అవ్వాలని కలలు కంటున్న 16ఏళ్ల బాలుడు తన తల్లినే హతమార్చాడు. అనంతరం 9 తులాల బంగారం కాజేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఏపీలో దారుణం.. 16 ఏళ్లకే డాన్ అవ్వాలని తల్లిని హత్య చేసిన కొడుకు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మాఫియా డాన్ అవ్వాలని కలలు కంటున్న 16ఏళ్ల బాలుడు తన తల్లినే హతమార్చాడు. అనంతరం 9 తులాల బంగారం కాజేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముంజేటి సతీష్, స్పందన దంపతుల కుమారుడు ఊర్లోనే ఓ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకుని ఇంటర్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నాడు. స్కూల్ లో ఓ అమ్మాయికి ప్రేమ లేఖ రాయడంతో యాజమాన్యం తల్లిని పిలిచి ఫిర్యాదు చేసింది. దీంతో తల్లి పలుమార్లు అతడిని మందలించింది. అంతే కాకుండా పెద్దలతో మర్యాదగా ఉండాలని, మంచిగా చదువుకుని క్రమ శిక్షణతో ఉండాలని చెప్పేది. స్కూల్ లో అమ్మాయికి లవ్ లెటర్ రాయడంతో ప్రతిరోజు అతడి బ్యాగ్ చెక్ చేయడం, సక్రమంగా నడుచుకోవాలని చెప్పడం లాంటివి చేసింది. ఈ క్రమంలో బాలుడు తల్లిపై కక్ష పెంచుకున్నాడు. తల్లి టార్చర్ చేస్తోందని స్నేహితుల వద్ద చెప్పుకున్నాడు.

తన తండ్రి, తల్లిని వదిలేసి వేరే మహిళతో ఉంటున్నాడని, మనం ముంబైకి వెళ్లి మాఫియా డాన్లు అవుదామని నిందితుడు మరో బాలుడికి చెప్పాడు. డాన్లు అవ్వాలంటే ముందుగానే నేర చరిత్ర ఉండాలని జపాన్ సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయ్యాడు. అందుకోసం తన తల్లిని చంపాలని స్నేహితుడితో కలిసి ప్లాన్ వేశాడు. స్పందన బయటకు వెళ్లిన సమయంలో తన మిత్రుడిని ఇంటికి పిలిచి బాత్రూంలో ఉండాలని చెప్పాడు. తన తల్లి బయట నుండి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కుంటుందని, లోపలకు వచ్చిన వెంటనే దాడి చేయాలని చెప్పాడు. నిందితుడు చెప్పినట్టుగానే స్పందన బాత్రూంలోకి వెళ్లగా అప్పటికే లోపల వేచి చూస్తున్న మరో బాలుడు ఆమె మెడ గట్టిగా పట్టుకుని ఊపిరి ఆడకుండా చేశాడు. అయినప్పటికీ శరీరంలో కదలికలు ఉండటంతో ఇద్దరూ కలిసి ఆమెపై 16 కత్తిపోట్లు పొడిచారు. తరవాత రక్తం మరకలు లేకుండా బాత్రూం కడిగేసి ఇంట్లో దాచిపెట్టిన 9తులాల బంగారం, రూ.5వేల నగదు తీసుకున్నారు.

అనంతరం మృతదేహాన్ని చీరలో చుట్టి పక్కనే ఉన్న కోనేరులో పడేసి అక్కడ నుండి పారిపోయారు. ఈ నెల 4వ తేదీన ఈ హత్య జరగ్గా పోలీసులు అననుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. హత్య చేసిన తరవాత నిందితులు భువనేశ్వర్, ముంబై, వైజాగ్, తిరుపతికి వెళ్లి తిరిగి పలాస వెళుతుండగా చిలకపాలెం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ సిమ్ కార్డులు తీసేసి పక్కా పథకం ప్రకారం నిందితులు తప్పించుకున్నా కొత్త సిమ్ లు వేసి ఇన్ స్టాగ్రామ్ లో తమ స్నేహితులకు టచ్ లో ఉన్నారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ సందేశాల ఆధారంగా పోలీసులు నిందితుల లొకేషన్ కనుగొన్నారు. అదుపులోకి తీసుకున్న తరవాత నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఏడాది క్రితం మరో బాలుడితో తనకు పరిచయం ఏర్పడగా ఇద్దరూ కలిసి జపాన్ సినిమాలు చూసినట్టు చెప్పాడు. అతడికి సైతం మాఫియా డాన్ అవ్వాలనే కోరిక ఉండటంతో యాక్షన్ యానిమేషన్ సినిమాలు చూస్తూ వాటిని అనుకరించేవాళ్లం అని తెలిపాడు. మాఫియాలో చేరాలంటే ఆధారాలు చూపించాలనే తన తల్లిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. మరోవైపు నిందితుడికి 10వ తరగతిలో 525 మార్కులు వచ్చినట్టు తెలుస్తోంది.

Next Story