సిడ్నీలో పహల్గామ్ తరహా ఉగ్రదాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |   (  Updated:2025-12-14 10:01:20  IST  )

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం సృష్టించింది.

సిడ్నీలో పహల్గామ్ తరహా ఉగ్రదాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్ వద్ద (Bondi Beach) ఉగ్రవాదులు కాల్పులు (Terrorist firing) జరపడం తీవ్ర కలకలం సృష్టించింది. భారత్‌లో పహల్గామ్ తరహలోనే సిడ్నీలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దారుణ సంఘటనలో కనీసం 10 మంది మరణించినట్లు న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ సర్వీస్ ప్రాథమికంగా వెల్లడించింది. మృతుల సంఖ్యపై పోలీసులు కూడా బహుళ మరణాలను ధృవీకరించారు. అలాగే డజన్ల కొద్దీ పర్యాటకులు, స్థానికులు గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటన జరిన సమయంలో, ఆ ప్రాంతంలోని బాండీ పార్క్ ప్లేగ్రౌండ్‌లో హనుక్కా పండుగ మొదటి రోజు కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ ఊహించని దాడితో ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు లోనైంది.

సంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆపరేషన్ ప్రారంభించారు. ఈ కాల్పులకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో క్రియాశీల ముప్పు (active threat) లేదని పోలీసులు ప్రకటించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలు ఆ ప్రాంతానికి రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల వెనుక ఉన్న ఉద్దేశాలు, నిందితుల పూర్తి వివరాలు మరియు మరణించిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ ఘటన సిడ్నీ నగరంలో తీవ్ర విషాదాన్ని, ఆందోళనను నింపింది.

Next Story