మహిళల టీ20 వరల్డ్ కప్: ఆసీస్ దెబ్బకు భారత్‌కు షాక్.. ప్రపంచకప్‌ నుంచి ఔట్

by Ramesh Naini |

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భారత మహిళల జట్టు పోరాటం ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

మహిళల టీ20 వరల్డ్ కప్: ఆసీస్ దెబ్బకు భారత్‌కు షాక్.. ప్రపంచకప్‌ నుంచి ఔట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భారత మహిళల జట్టు పోరాటం ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా సెమీస్‌కు అర్హత సాధించాయి.

మెరిసిన హర్మన్‌ప్రీత్..

ఆదివారం లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 56 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షెఫాలీ వర్మ (34) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 2 వికెట్లు పడగొట్టింది.

పెర్రీ, గార్డ్‌నర్ అద్భుత భాగస్వామ్యం

అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో ఓవర్ (6 బంతులు) మిగిలి ఉండగానే.. కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎలీసా పెర్రీ (38 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు), ఆష్లీ గార్డ్‌నర్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వీరిద్దరూ కలిసి కేవలం 57 బంతుల్లోనే సరిగ్గా 100 పరుగులు జోడించి భారత్ నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఇతర బ్యాటర్లలో బెత్ మూనీ 22, లిచ్‌ఫీల్డ్ 24 పరుగులు చేశారు.

దీప్తి శర్మ సరికొత్త చరిత్ర..

భారత బౌలర్లలో శ్రీచరణి 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా దీప్తి శర్మ.. మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎలీసా పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Next Story