IND vs PAK : పాక్ చిత్తు.. 61 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘనవిజయం

by Ramesh Naini |   (  Updated:2026-02-15 17:13:13  IST  )

టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

IND vs PAK : పాక్ చిత్తు.. 61 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘనవిజయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో టీమ్ ఇండియా 61 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్, భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది. నిర్ణీత 18 ఓవర్లలోనే 114 పరుగులకు పాక్ ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (44) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీస పోటీని ఇవ్వలేకపోయారు. షహీన్ అఫ్రిది (23*), షాబాద్ ఖాన్ (14), ఫహీమ్ అఫ్రఫ్‌ (10) పరుగులు చేశారు. సాహిబ్జాడ ఫర్హాన్ డకౌట్ కాగా.. ఆయూబ్ (6), సల్మాన్ అఘా (4), బాబర్ అజామ్ (5), మహ్మద్ నవాజ్ (4) స్కోరు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీశారు. కుల్‌దీప్ యాదవ్, తిలక్ వర్మలకు చెరో వికెట్ దక్కింది.

పాక్‌పై 8-1తో భారత్ ఆధిక్యం

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచింది. పటిష్టమైన స్కోరును సాధించి పాక్‌పై మానసిక విజయాన్ని ముందే నమోదు చేసింది. ఈ విజయంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు జరిగిన ముఖాముఖి పోటీల్లో భారత్ 8-1తో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.

Next Story