IND vs PAK : పాక్ స్పిన్తో కొడితే.. పేస్తో దెబ్బకు దెబ్బ తీసిన భారత్

by Ramesh Naini |

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు.

IND vs PAK : పాక్ స్పిన్తో కొడితే.. పేస్తో దెబ్బకు దెబ్బ తీసిన భారత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. పాక్ జట్టు వ్యూహాత్మకంగా ఆరుగురు స్పిన్నర్లను ప్రయోగించి భారత్‌ను కట్టడి చేయాలని చూసినా, భారత పేసర్లు తమ పదునైన బంతులతో పాక్ బ్యాటింగ్‌‌కు కల్లెం వేశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్, భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడుతోంది.

పేస్ ధాటికి కుప్పకూలిన టాప్ ఆర్డర్..

ఛేదన ప్రారంభించిన పాకిస్తాన్‌కు తొలి ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ఫర్హాన్‌ను డకౌట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా తన ప్రతాపం చూపాడు. ఓవైపు సయీమ్ అయూబ్ (6)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన బుమ్రా, మరోవైపు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (4)ను పెవిలియన్ పంపి పాక్ కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో కేవలం 34 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన ఉస్మాన్ ఖాన్ (44) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, అక్షర్ పటేల్ వేసిన తెలివైన బంతికి ఉస్మాన్ ఖాన్ స్టంపౌట్ అయ్యాడు. వికెట్ల వెనుక ఇషాన్ కిషన్ మెరుపు వేగంతో స్పందించి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. అంతకుముందే స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ (5)ను కూడా అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 73 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోవడంతో పాక్ ఓటమి అంచున నిలిచింది. మరోవైపు కుల్‌దీప్‌ బౌలింగ్‌లో నవాజ్ (5) ఔట్ అయ్యాడు. అలాగే తిలక్‌ వర్మ వేసిన తొలి బంతికే షాదాబ్‌ (14)ను పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం 78 పరుగుల వద్ద పాక్ ఏడో వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో ఉంది.

ఆరుగురు స్పిన్నర్లతో పాక్ ప్రయోగం..

మ్యాచ్‌లో పాకిస్తాన్ వింత వ్యూహంతో బరిలోకి దిగింది. ఏకంగా ఆరుగురు స్పిన్నర్లతో (సల్మాన్ అఘా, సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిఖ్) బౌలింగ్ చేయించింది. స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదితో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయించడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సూర్య సేన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసి పాక్ ముందు లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం భారత బౌలర్ల జోరు చూస్తుంటే విజయం టీమిండియా వైపే మొగ్గు చూపుతుంది.

Next Story