పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్.. పాయింట్ల కోతతో పాటు భారీ జరిమానా

by Ramesh Naini |

బంగ్లాదేశ్ చేతిలో చారిత్రక టెస్టు ఓటమి చవిచూసిన పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్ ఇచ్చింది.

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్.. పాయింట్ల కోతతో పాటు భారీ జరిమానా
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్ చేతిలో చారిత్రక టెస్టు ఓటమి చవిచూసిన పాకిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) డబుల్ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్లను కూడా తగ్గించింది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ నిర్ణీత సమయానికి 8 ఓవర్లు తక్కువగా వేసినట్లు మ్యాచ్ అధికారులు గుర్తించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం (ఓవర్‌కు 5 శాతం చొప్పున) పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం మేర జరిమానా విధించారు.

8 పాయింట్ల కోత.. దిగజారిన స్థానం

డబ్ల్యూటీసీ 2025-27 నిబంధనల ప్రకారం (ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున) పాక్ ఖాతా నుంచి ఏకంగా 8 పాయింట్లను ఐసీసీ కట్ చేసింది. ఈ పాయింట్ల కోతతో డబ్ల్యూటీసీ పట్టికలో పాకిస్థాన్ కేవలం 4 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు కంటే దిగువన వెస్టిండీస్ మాత్రమే ఉంది. పాక్ కెప్టెన్ షాన్ మసూద్ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ ఈ శిక్షను ఖరారు చేశారు.

బంగ్లాదేశ్ చారిత్రక విజయం..

కాగా, ఈ (Test match) టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. పాక్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. బంగ్లా ఫాస్ట్ బౌలర్ నహిద్ రానా ఐదు వికెట్లు పడగొట్టి ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించగా, చివరి రోజు ఒత్తిడికి చిత్తయిన పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది.

Next Story