భారత్‌తోనే భవిష్యత్ : క్రికెట్ ఆస్ట్రేలియా

by  |
భారత్‌తోనే భవిష్యత్ : క్రికెట్ ఆస్ట్రేలియా
X

కరోనా కారణంగా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోయాయి. మార్చి 13న ఆసీస్-కివీస్ మధ్య వన్డే ప్రేక్షకులు లేకుండా జరిగిన మ్యాచే ఆఖరిది. ఇక ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో సగం వరకు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో ఆటలకు బ్రేక్ పడింది. దీంతో ఆదాయం లేక అతలాకుతలం అవుతోన్న క్రికెట్ బోర్డులన్నీ తిరిగి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు గల మార్గాలను అన్వేషిస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత కొన్ని దేశాలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భావిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. షెడ్యూల్ ప్రకారం 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌తో ఆడితే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు.. టీవీల్లోనూ ఎక్కువ మంది చూసే వీలుంది. అందుకే ఈ సిరీస్‌లో 5 టెస్టులు ఆడాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

స్టేడియాలకు ప్రేక్షకులు రాకపోయినా.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు టీవీల్లో టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ. తద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించవచ్చనే ఉద్దేశంతో మరిన్ని మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో కెవిన్ రాబర్ట్స్ అన్నారు. ‘ప్రస్తుతం అన్ని బోర్డులు ఆదాయాన్ని రాబట్టుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, ఆదాయ మార్గం ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదని’ ఆయన స్పష్టం చేశారు. మేం టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నా.. దాని ద్వారా ఎక్కువ ఆదాయం రాదని.. మెగా టోర్నీల కంటే ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారానే ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. బ్రాడ్‌కాస్టర్ల హక్కుల ద్వారా వచ్చే ఆదాయం బోర్డుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.

కాగా, కరోనా కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 20 మిలియన్ డాలర్ల నష్టం చవిచూసిందని.. భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే సీఏ 80 శాతం మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించింది. ఈ లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే.. ఆగస్టు నాటికి ఆసీస్ క్రికెట్ బోర్డు వద్ద నిధులు పూర్తిగా నిండుకుంటాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే సీఏ..తన ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తోంది.

Tags: Cricket Australia, India, Financial crisis, lockdown, corona


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed