ఎర్రజెండాకు పూర్వ వైభవం రాబోతోంది : నున్నా నాగేశ్వరరావు

by  |
CPM leader Nunna Nageswara Rao
X

దిశ, కల్లూరు: రాజకీయాలను డబ్బు, మద్యం, మతం శాసిస్తున్నాయని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని ఎర్రబోయినపల్లి గ్రామంలో సీపీఎం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. డబ్బు ఉంటే ఓట్లు కొనుక్కోవచ్చు, ఓట్లతో ప్రజాప్రతినిధి కావొచ్చని అన్నారు. ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అయిన జీవితాల్లో నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలను కేంద్రం కంటిమీద కునుకులేకుండా చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలకు కష్టాలు మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నేతలు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారని, గెలిచాక ప్రజా సమస్యలను చట్ట సభల్లో చర్చించేవారని అన్నారు. కానీ, నేడు విలువలు కోల్పోయి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. కమ్యూనిస్టు పార్టీల నేతలు తమవంతు సహాయం చేస్తున్నారని, కరోనా సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యం, ఆహారం అందించామని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికీ కనుమరుగు కావని, ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారని, మళ్లీ కమ్యూనిస్టు పార్టీలకు పూర్వవైభవం రాబోతుందని అన్నారు. ప్రజా సమస్యలు వెలికి తీసి వాటి పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకులకు ప్రజాసంఘాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు భారతి, వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు భద్రయ్య, కృష్ణవేణి, పుల్లయ్య, వెంకటేశ్వరరావు, అంజయ్య, భాస్కర్ రావు, పాండురంగారావు, రాజబాబు, శ్రీనివాసరావు, తేగుళ్ళ బాబు, నరసింహరావు హాజరయ్యారు.


Next Story