నాగార్జునపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

by  |
నాగార్జునపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన సీపీఐ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడారు. తనకు హీరో నాగార్జున అంటే చాలా అభిమానమని, కానీ ఆయన బిగ్ బాస్ షోలో దరిద్రపు పనులు చేస్తున్నాడని ఆరోపించారు. బిగ్‌బాస్‌లో ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఒక యువకుడిని ఎవర్ని కిస్ చేస్తావు..? ఎవరితో డేటింగ్ చేస్తావు..? ఎవరిని పెళ్లి చేసుకుంటావు..? అని ఓపెన్‌గా అడిగారని గుర్తు చేశారు. అవే ప్రశ్నలు ఆ ఫొటోల్లో ఆయన ఇంట్లోని మహిళా నటుల ఫొటోలు పెట్టి అడగ్గలడా..? అని ప్రశ్నించారు.

పద్ధతిగా ఉన్న నాగార్జున ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్తే.. కనీసం కింది కోర్టులు కూడా కేసులు తీసుకోలేదని చెప్పారు. జిల్లా కోర్టుల్లో కూడా కేసులు తీసుకోలేదని వెల్లడించారు. మనది పితృభూమి కాదు మాతృభూమి అనీ.. మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా..? అని ప్రశ్నించారు. నాగార్జున సమాజానికి క్షమాపణ చెప్పేవరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. ఈయన వ్యాఖ్యలపై ఇంతవరకూ షో యాజమాన్యం కానీ వ్యాఖ్యాత నాగార్జున కానీ స్పందించక పోవడం గమనార్హం.

Next Story

Most Viewed