నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్

by  |
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్
X

దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు.. వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో నకిలీ విత్తనాలను విక్రయించే ముఠా గుట్టు రట్టు చేశారు. వీరి నుంచి 2,500 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 7 వేల కిలోల నకిలీ మొక్కజొన్న విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసు అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికాస్ బయో సైన్స్ కంపెనీకి ఎండీగా కొనసాగుతున్న కల్లె శ్రీనివాస్‎కు షామీర్ పేటలో ఆదర్శ సీడ్స్ పేరుతో ఫెర్టిలైజర్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నకిలీ విత్తనాల ద్వారా అత్యధికంగా లాభాలు ఆర్జించాలని భావించాడు. దీంతో కర్నూలు జిల్లా నంద్యాల నివాసి మౌలేశ్వర్ రెడ్డితో ప్రాసెస్ చేసిన విత్తనాలను కొనుగోలు చేసి సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూర్‌లోని తన ప్లాంట్‎కు తరలింపులు మొదలుపెట్టాడు. ఇక్కడ రసాయనాలను కలిపిన విత్తనాలను రఘు-39 పేరుతో 450 గ్రాముల ప్యాకింగ్‌లతో మార్కెట్‎లో విక్రయిస్తున్నాడు. అంతే కాకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు, సబ్ డీలర్ల ద్వారా చత్తీస్ ఘడ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ నకిలీ విత్తనాల దందాను కొనసాగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శ్రీనివాస్ దుకాణంపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే దుకాణం, మరో 5 గురు ఏజెంట్ల నుంచి కూడా భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు వాహనాలను సీజ్ చేశారు.

పీడీ యాక్ట్ నమోదు చేస్తాం: సీపీ సజ్జనార్

నకిలీ పత్తి విత్తనాలు అమ్మేవారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నకిలీ విత్తన వ్యాపారాలపై ఆయన ఎస్ఓటి, వ్యవసాయశాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అమాయక రైతులను పట్టి పీడిస్తూ, వారిని అప్పుల్లోకి నెడుతున్న నకిలీ పత్తి విత్తనాలను శాశ్వతంగా అరికడతామన్నారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. కల్తీ విత్తనాల, ఎరువులు కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాలవుతున్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు తయారుచేసే కంపెనీలు, సరఫరాదారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అక్రమ వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులను బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు, వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి తెలపాలనీ, లేదంటే .. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నెంబర్ 9490 617 444, లేదా డయల్ 100 కాల్ చేసి తెలిపినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed