రేషన్ కార్డుల దందా.. వారికి ముడుపులు ఇస్తే కార్డు మంజూరు

1715

దిశ, మణుగూరు : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేని వారిని ఎంపిక చేసి రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నది. ఈ కార్డు ఉన్న నిరుపేదలకు నెల నెలా రేషన్ షాపుల ద్వారా బియ్యం, నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వం ఇలా చేయడం ద్వారా కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో రేషన్ కార్డుల దందా జోరుగా
జరిగిందని విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా మండలంలో ఉన్న నిరుపేదలకు రేషన్ కార్డులను మంజూరు చేయడంలేదు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు, కోట్లకు పడగలెత్తిన బడాబాబులకు రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రేషన్ కార్డులు పేదల కోసమా..? బడాబాబుల కోసమా అని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లిస్తేతేనే రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మండలంలో కోట్లకు పడగలెత్తిన బడాబాబులకు రేషన్ కార్డులు మంజూరు అయ్యాయంటే రెవెన్యూ అధికారులకు ఏవిధంగా ముడుపులు అందాయో అర్థమౌతోంది. ఒక్క రేషన్ కార్డుకి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు రెవెన్యూ అధికారులు వసూళ్లు చేశారని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. పేదలు.. అధికారులకు ముడుపులు చెల్లించుకోలేకనే రేషన్ కార్డులు మంజూరు కాలేదని తెలుస్తోంది.

మండలంలో సింగరేణి ఉద్యోగులకు, కొంతమంది బడావ్యాపారస్తులకు రేషన్ కార్డు ఎలా మంజూరు చేశారని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యాన్ని సింగరేణి ఉద్యోగులు, బడా వ్యాపారస్తులు అధిక ధరలకు అమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఎంతో మంది నిరుపేదలకు మాత్రం రేషన్ కార్డులు అందని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు రేషన్ కార్డులపై చర్యలు చేపట్టి మండలంలో ఉన్న నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చూడాలని పలువురు మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళా సంఘాలు కార్యకర్తలు కోరుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..