ఆ జిల్లాకు ఇద్దరు డీటీవోలు.. పైసలిస్తేనే పని..!

by  |
ఆ జిల్లాకు ఇద్దరు డీటీవోలు.. పైసలిస్తేనే పని..!
X

దిశ, మెదక్ : మెదక్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ‘కాసుల వర్షం’ కురుస్తోంది. పైసలిస్తేనే పని జరుగుతోంది. లేదంటే జరగదు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నా అమ్యమ్యాలు సమర్పించాల్సిందే. లేని పక్షంలో సంవత్సరాల తరబడి ఆగాల్సిందే. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక జిల్లాలో ఇద్దరు డీటీవోలు విధులు నిర్వర్తిస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంతకీ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏం జరుగుతోంది..? అవినీతికి ఆజ్యం పోస్తుందెవరు..? అనే అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం..

చేయి తడపనిదే పనికాదు…

ఒకప్పుడు జిల్లా కేంద్ర నడిబొడ్డున రవాణా కార్యాలయం ఉండేది. ఇక్కడ ఏజెంట్లదే హవా ఉండడంతో సామాన్యులకు తిప్పలు తప్పేవి కావు. ఈ నేపథ్యంలో ఓ సంఘ నాయకుడు అక్రమాలపై ప్రశ్నిస్తే ఏకంగా అతన్ని మట్టుబెట్టే కుట్ర జరగడం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ కేసు పోలీసు విచారణలో నడుస్తోంది. ఈ పరిణామాల అనంతరం జిల్లా కార్యాలయాన్ని పట్టణ శివారులోని కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఇంట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడా అదే ధోరణి అవలంబిచడం గమనార్హం. వాస్తవానికి జిల్లాకు ఒక్క డీటీవో సరిపోతుంది.

కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. తన అక్రమాలకు ఓ తోడు కావాలనుకున్నాడో ఏమో.. సంబంధిత అధికారి పైరవీలు చేసి మరీ మరో అధికారిని ఇక్కడకు రప్పించుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇక్కడి నుండి వీరు ఆడిందే ఆట పాడిందే పాటలా తయారైంది వ్యవహారం. డిసెబర్ 19 న పట్టణానికి చెందిన ఐదు మంది మహిళలు టూ వీలర్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు, ఫీజులు అన్నీ చెల్లించినా పాన్ కార్డు, టెన్త్ మెమో, ఇతర గుర్తింపు కార్డులు లేవని కొర్రీలు వేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 5 వేల వరకు లాగినట్లు బాధితులు ఆరోపించారు.

ఏజెంట్లదే హవా..

ఇటీవల ఓ జర్నలిస్ట్ సదరు కార్యాలయానికి న్యూస్ కోసం వెళ్లాడు. దీంతో అక్కడి సిబ్బంది చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దురుసుగా ప్రవర్తించి కొట్టినంత పనిచేశారు. జిల్లా రవాణా శాఖలో మొత్తం ఏజెంట్ల హవా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కావాలనే జిల్లా అధికారి ఏజెంట్ల వ్యవస్థ ద్వారా భారీగా డబ్బులు లాగే పనికి పూనుకున్నారని సమాచారం. ఇక్కడ పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్ల అక్రమంగా వసూలు చేసిన సొమ్మును అదేరోజు రాత్రి పెద్దసారుకు ఇచ్చి తమ స్వామిభక్తి ప్రదర్శిస్తారు. దీనికి ఉడతా భక్తిగా వారికి కొద్దో గొప్పొ చెల్లిస్తారు.

ప్రవేశద్వారం దగ్గరే సీసీ కెమెరాలు ..

సీసీ కెమెరాలు ప్రవేశద్వారం దగ్గర మాత్రమే ఉండడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రతీ సెక్షన్ రూమ్ లో సీసీ కెమెరాల నిఘా ఎందుకు లేదని పలువురు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా కోడ్ భాష ఉంటుంది. అది వేరే వారికి అర్థం కాదు. ఏ ఫైల్ కదలాలన్నా ఎవరికి లైసెన్సులు ఇవ్వాలన్న వీరి జేబులు మాత్రం నిండాల్సిందే.ఎవరైనా అడిగినా లేదా ప్రశ్నించినా అక్కడే ఉన్న సిబ్బందితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి పురమాయిస్తారని తెలుస్తోంది.

పేరుకే ఏజెంట్…అక్రమాలలో పార్ట్ నర్…

ఆయనో ఏజెంట్ కానీ ఇతని పుత్రుడు ఏకంగా లైసెన్సుల దుకాణాన్నే నడుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. తూప్రాన్ లోని ఓ ద్విచక్ర షోరూమే అడ్డాగా తన దగ్గరకు వచ్చే వారిని మభ్యపెట్టి లైసెన్స్ కోసం వస్తే కేవలం ఇంజిన్ మాత్రమే చూసి భారీగా డబ్బులు గుంజి మరో ఆర్టీఐ గా చెలామణి అవుతున్నారని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అక్రమార్జన… ఆదాయానికి మించి ఆస్తులు…!

ఈ వ్యవహారంలో దండిగా డబ్బులు దండుకుంటున్న సదరు అధికారిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు అనధికార వ్యక్తుల ద్వారా ఫైళ్లు వాటితో పాటు డబ్బులు కూడా వస్తాయి. కానీ సీన్లో ఎక్కడా జిల్లా అధికారి మాత్రం కనిపించడు. రోజువారీ వచ్చిన డబ్బులను కార్యాలయంలోని ఓ రూమ్ లో లెక్కించి తన అనుచర గణానికి కొంత సొమ్ము ముట్టజెప్పి అర్ధరాత్రి తర్వాత పట్టణంలోని వెంకట్రావు నగర్ కాలనీలో ఉండే తమ రహస్య గదిలో జల్సాలు చేస్తారని వినికిడి.

అనంతరం వీకెండ్ శనివారం రోజున సదరు జిల్లా అధికారి హైదరాబాద్ బయలుదేరతాడు. కానీ విచిత్రంగా ఒక్కోరోజు ఒక్కో దారిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఒక్కసారి వచ్చిన మార్గంలో మళ్లీ ప్రయాణం చేయడని, తన కారులోనే వచ్చిన డబ్బునంత డంప్ చేస్తాడని కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. ఈ సిండికేట్ వ్యాపారంలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని సమాచారం. ఈ అక్రమార్జనతో హైదరాబాద్ లోని సోమాజీగూడ, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకున్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed