కరోనా దెబ్బకు తినడం, తిరగడం తగ్గాయి!

by  |
కరోనా దెబ్బకు తినడం, తిరగడం తగ్గాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఇండియాలోనూ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో ప్రధానంగా నష్టాలను ఎదుర్కొనే వర్గాలు రెస్టారెంట్లు, కేఫ్ పరిశ్రమలతోపాటు రోజూ ఉద్యోగులను, ఇతరులను గమ్య స్థానాలకు చేర్చే ఓలా, ఉబర్ లాంటి ట్యాక్సీలు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసేయగా, చాలామంది ట్యాక్సీ డ్రైవర్లు తమ వాహనాలను ఇంటి నుంచి బయటకు తీయడంలేదు.


తినడాల్లేవ్..

గత వారం నుంచి రెస్టారెంట్లు, కేఫ్ పరిశ్రమలకు భారీగా నష్టాలు ఏర్పడ్డాయి. కేవలం వారానికే ఇంతటి నష్టాన్ని భారించాల్సి రావడం ఇది మొదటిసారని, రానున్న రోజుల్లో ఈ పరిస్థితులను అధిగమించడం మాకు మరింత కష్టమవుతుందని రెస్టారెంట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెస్టారెంట్లు మూసివేత వల్ల సిబ్బందికి జీతాలలో కోతలు మొదలయ్యాయి. ఇలాగే కొనసాగితే పూర్తిగా వేతనాలివ్వలేని పరిస్థితి వస్తుందని, కొందరి ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

‘రెస్టారెంట్లు మూసేయడం వల్ల సిబ్బందికి జీతాలు ఇచ్చే ఆదాయం కోల్పోతున్నాం. మా సిబ్బందికి చెల్లించేందుకు మా వద్ద సేవింగ్స్ ఏమీ లేవు. ఇది భవిష్యత్తు ఉద్యోగాలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది’ అని ఆలివ్ బార్ అండ్ కిచెన్ యజమాని చెప్పారు. రెస్టారెంట్ల యూనియన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రెస్టారెంట్లను మూసేయాలని స్పష్టం చేసింది.

నేషనల్ రెస్టారెంట్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధీనంలో దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నిటినీ మార్చి 31 వరకూ మూసేయాలని ఆదేశాలు అందాయి. ఇండియాలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు అనేక రాష్ట్రాల్లో రెస్టారెంట్లు మూసేయబడ్డాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో చిరుతిండ్లను అమ్మడాన్ని నిషేధించారు. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, జిమ్స్ మూసేయాలని ప్రభుత్వం కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. కొన్ని రెస్టారెంట్లు పూర్తిగా నష్టాలను భరించలేక ఆన్‌లైన్ డెలివరీలను ప్రారంభించాయి. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాపై పరోక్ష పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇక, ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి, జొమాటో తమ డెలివరీ ఉద్యోగులకు శానిటైజర్లను అందిస్తున్నాయి. తరచూ పరిశుభ్రతను పాటించాలని జాగ్రత్తలు చెబుతున్నాయి.


తిరగడాల్లేవ్..

కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న మరో వర్గం ట్యాక్సీ డ్రైవర్లు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలనే నిర్ణయాన్ని అమలు చేయడంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓలా, ఉబర్ డ్రైవర్లు గిరాకీలు లేక ఆదాయాన్ని కోల్పోతున్నారు. ముంబై, బెంగళూరు వంటి నగరాల డ్రైవర్ల అసోషియేషన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఒక్క మార్చిలోనే 80 శాతం రైడ్స్ తగ్గిపోయాయని, ఈ పరిణామాలతో తమ డ్రైవర్లు కట్టాల్సిన రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. పరిస్థితులను అంచనా వేసిన డ్రైవర్ల అసోషియేషన్ సంఘం వారు రెండు నెలల వరకూ లోన్ల విషయంలో గడువు ఇవ్వాలని ఫైనాన్స్ కంపెనీలను అభ్యర్థించాయి.

కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా ట్యాక్సీల్లో పూల్, షేరింగ్ ప్లాట్‌ఫామ్ సేవలను నిలిపేశామని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఉబర్ సంస్థ షేర్ రైడింగ్ సేవలను నిలిపేసింది. ఇండియాలో మాత్రం పూర్తిస్థాయిలో ఈ చర్యలు తీసుకున్నట్టు ఇంకా నిర్ధారించలేదు. ‘మా డ్రైవర్లకు రోజూవారీ రైడ్స్‌లో 80 శాతం తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వారి ఆదాయంపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు మహీంద్రా ఫైనాన్స్ వంటి ఇతర కార్ల రుణ ఫైనాన్సియర్లకు కొన్ని అభ్యర్థనలు చేశాం. కనీసం రెండు నెలల వరకు రుణాల మాఫీకి మినహాయింపు ఇవ్వాలని కోరాం’ అని మహారాష్ట్రలో మూడు వేలకుపైగా ఉన్న డ్రైవర్ల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సునీల్ అన్నారు.

కర్ణాటకలో మొత్తం 28,000 డ్రైవర్లున్న ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్, ఉబర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోషియేషన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన్వీర్ మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి వల్ల మా వ్యాపారాలు ప్రభావితం అవ్వడమే కాకుండా, మా డ్రైవర్లకు ఆర్థికంగా కలిగే నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు స్పష్టం చేశారు. కరోనా వైరస్ భయానికి దేశవ్యాప్తంగా కొందరు డ్రైవర్లు తమ వాహనాలను నడపటానికి కూడా వెనుకాడుతున్నారు. ‘కరోనా భయానికి ఇప్పటికే పది శాతం వాహనాలు రోడ్ల మీదకు రావడం తగ్గాయి. ఓలా, ఉబర్ వంటి సంస్థల డ్రైవర్లు మాస్కులు, శానిటైజర్ల వంటి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా సోకినట్లు అనుమానం ఉన్న డ్రైవర్ల అకౌంట్లను ప్రస్తుతానికి నిలిపేశామని, కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు తేలితే కంపెనీ ఆర్థికంగా సహాయం అందిస్తుందని ఉబర్ ప్రకటించింది. ఎవరైనా కరోనా సోకినట్టు పబ్లిక్ హెల్త్ అథారిటీ నుంచి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తే వారికి 14 రోజులపాటు కంపెనీయే ఆర్థిక సాయం చేస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. డ్రైవర్లు తమ కార్లను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఉబర్ పేర్కొంది. ‘ఉబర్ ఫ్లాట్‌ఫామ్‌లోని తమ ఉద్యోగులు, వినియోగదారుల భద్రత కోసం కృషి చేస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం’ ఉబర్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

డ్రైవర్లకు శానిటైజర్లు, మాస్క్‌లు అందిస్తున్నామని ఓలా సంస్థ తెలిపింది. డ్రైవర్లు, వినియోగదారులకు 24 గంటలు భద్రత అందించే విషయంలో రాజీ పడమని, దానికి తగిన చర్యలను మొదలుపెట్టామని స్పష్టం చేసింది. కరోనా వైరస్ లక్షణాలను గుర్తించేందుకు, ఇప్పటికే ఉన్న కేసులను పరిశీలించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేశామని ఓలా ప్రకటించింది.

Tags : coronavirus, loan waivers, Ola, uber, rides plunge, cafe industry,

Next Story

Most Viewed