తెలంగాణ ప్రజలకు.. చివరి ప్రమాద హెచ్చరిక

by  |
తెలంగాణ ప్రజలకు.. చివరి ప్రమాద హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి గంభీరంగా ఉందని, గతేడాది వచ్చిన ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ఇది ఒక ప్రమాద హెచ్చరికగా పరిగణించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ప్రజల సహకారం కూడా చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజలు బాధ్యతతో లేనందువల్లనే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నదన్నారు. దాదాపు 3 నెలలుగా మాస్కులు, సోషల్ డిస్టెన్స్ లాంటివన్నీ మర్చిపోయారని, ఇప్పుడు అదే ఉపద్రవంగా మారిందన్నారు.

ఇప్పుడు మేలుకోకపోతే ముప్పును కొని తెచ్చుకోక తప్పదని హెచ్చరించారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి రావద్దనుకుంటే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని అన్నారు. కేసులు పెరిగితే వైద్యారోగ్య శాఖపై ఒత్తిడి ఎక్కువవుతుందని, వారు అనారోగ్యంపాలైతే మళ్లీ ప్రజలకే నష్టమని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ‘దిశ’కు మంగళవారం ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

దిశ : ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎలా ఉంది?

డాక్టర్ శ్రీనివాసరావు : చాలా సీరియస్‌గా ఉంది. రాష్ట్రంలో సగం మంది మాస్కులే పెట్టడంలేదు. కొవిడ్ నిబంధనలను పాటించడంలేదు. దాదాపు మూడు నెలలుగా కరోనా పోయిందనే భావనతో ఉన్నారు. నిబంధనలను గాలికొదిలేశారు. ఇప్పుడు అదే మనల్ని కలవరపెడుతోంది.

చేయిదాటిపోయిందనుకోవచ్చా?

నదులకు వరదలు, సముద్రాలకు తుపానులు వచ్చినప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ఒక్కో నెంబరు హెచ్చరిక ఒక్కో తీవ్రతను తెలియజేస్తుంది. చివరి హెచ్చరిక వచ్చిన తర్వాత ప్రజలు స్వచ్ఛందగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లక తప్పదు. లేకుంటే నష్టపోతారు. ఇప్పుడు కూడా అలాంటి చివరి ప్రమాద హెచ్చరికలోనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మెలగాలి. లేకుంటే మన ఉనికికే ఎసరొస్తుంది? చేయిదాటిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది.

ఇప్పుడేం చేయాలి?

వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాయి. వాటిని తు.చ. తప్పకుండా ప్రజలు పాటించాలి. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇల్లు విడిచి బైటకు రావద్దు. బయటకు రావడమంటే రిస్కులో పడుతున్నట్లుగానే భావించాలి. మాస్కులు తప్పక ధరించాలి. శానిటైజర్లను వినియోగించాలి. భౌతిక దూరం పాటించాలి.

ప్రభుత్వం ఎన్‌పోర్స్‌మెంట్‌ను పటిష్టం చేయాలిగదా!

స్వచ్ఛందంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అర్థం చేయించింది. స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఇళ్ల కు పరిమితం కావాలని చెప్పింది. కానీ పార్కులు, స్విమ్మింగ్ పూల్‌లు, థీమ్ పార్కులు లాంటివాటికీ క్యూ కడుతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నది. సీఎస్ వీడియో కాన్ఫరెన్సు పెట్టి పోలీసులు, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖలను అప్రమత్తం చేశారు. సీరియస్‌గా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

మళ్లీ లాక్‌డౌన్, కర్ఫ్యూ అనివార్యమా?

అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది ప్రజలు. ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సినవి జరుగుతున్నాయి. అందుకు ప్రజల సహకారం కూడా ఉండాలి. పెళ్ళిళ్లు, అంతిమయాత్రల విషయంలో జాగ్రత్తలు చెప్పినా పాటించడంలేదు. షాపింగ్ మాల్స్ విషయంలోనూ అదే జరుగుతున్నది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వందలాది మందికి ఎలా వైరస్ సోకిందో చూశాం. జాగ్రత్తలు తీసుకోకుంటే అలాంటివే జరుగుతాయి.

సెకండ్ వేవ్‌లో వ్యాప్తి ఎందుకు ఎక్కువగా ఉంటోంది?

వైరస్ ఎప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా తన స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే తొలి వేవ్‌కంటే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ. ఈ ఏడాదిలో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మనగలిగేలా రూపాంతరం చెందింది. వైరస్ వేగంగా వ్యాపించడానికి అదే కారణం. అప్పుడు ఆరు నెలల్లో పీక్ స్టేజీకి చేరింది. కానీ ఇప్పుడు అది రెండు నెలల్లోనే వచ్చేస్తుంది.

వైద్యం కోసం తీసుకుంటున్న చర్యలేమిటి?

ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గతేడాది పెట్టిన క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాలను మళ్లీ తెరుస్తున్నాం. అదనంగా స్కూళ్లు , హాస్టళ్లు, లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లలో కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం తరఫున 20 వేల బెడ్‌లను సిద్ధం చేస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు సైతం అదనంగా మరో పది వేల బెడ్‌లను ఇతర ప్రైవేటు భవనాల్లో సిద్ధం చేసుకోవాల్సిందిగా స్పష్టం చేశాం.

చికిత్సకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా?

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను వాయిదా వేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. తప్పనిసరిగా ఆస్పత్రి పర్యవేక్షణలో ఉండాల్సిన కేసుల్ని మాత్రమే అడ్మిట్ చేసుకోవాల్సిందిగా చెప్పాం. కరోనా కేసుల కోసం మొత్తం బెడ్ సామర్థ్యంలో సగం రిజర్వు చేసి ఉంచాలని చెప్పాం. పరిమిత సంఖ్యలోనే ఉన్న వైద్య సిబ్బందిని ఎప్పుడూ అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసుకున్నాం. సౌకర్యాలను ఎంతగా సమకూర్చుకున్నా డాక్టర్లను, నర్సులను అప్పటికప్పుడు సృష్టించలేం. కాబట్టి వారు అలసిపోకుండా ఉండాలన్నా, వారి సేవలు అందాలన్నా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పాజిటివ్ బారిన పడకుండా చూసుకోవడం ఉత్తమం.

మహారాష్ట్ర సరిహద్దులో కేసులెందుకు పెరుగుతున్నాయి?

మహారాష్ట్రలోని పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. టెస్టులు, ట్రేసింగ్ చేస్తున్నాం. అయినా కొందరు కాలి నడకన వస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది కంట పడటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందుకే పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక క్యాంపులు పెట్టి టెస్టులు చేస్తున్నాం.

కంటైన్‌మెంట్ వ్యవస్థ మళ్ళీ వస్తుందా?

వైరస్ వ్యాప్తి ఉన్నప్పుడు ఇది తప్పదు. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంటుంది. మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌లు ఉంటాయి. విడి ఇళ్లు, అపార్టుమెంట్లు, కొన్ని అంతస్తులకు మాత్రమే పరిమితం చేయడం లాంటిదే ఉంటుంది. మొత్తం వీధిని ఐసొలేట్ చేయడం ఉండదు.

లాక్‌డౌన్, కర్ఫ్యూ ఎందుకు వద్దంటే

“లాక్‌డౌన్, కర్ఫ్యూ పెట్టడం ద్వారా ప్రజల కదలిక పరిమితమవుతుంది. వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు. కానీ ప్రజలే మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ లాంటి స్వీయ నియంత్రణా చర్యలు పాటిస్తే లాక్‌డౌన్, కర్ఫ్యూ అవసరం ఏర్పడదు. పైగా వీటిని విధిస్తే దుకాణాలు, ఆఫీసులు.. అన్నీ బందు పెట్టాల్సి ఉంటుంది. వీటిపైన ఆధారపడి బతికే లక్షలాది మంది ఉపాధి పోతుంది. ఆర్థికంగా చితికిపోతారు. గతేడాది కళ్లారా ఆ కష్టాల్ని చూశాం. పైగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమం. కర్ప్యూ, లాక్‌డౌన్‌లు పరిష్కారం కాదు.

స్కూళ్ల ఎందుకు మూసేశారంటే?

స్కూళ్ళను మూసివేయడానికి నిర్దిష్ట కారణం ఉంది. పిల్లలు పూర్తిగా అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉన్నవారు కాదు కాబట్టి వారి ఆరోగ్యం కోసం మూసేయాల్సి వచ్చింది. కానీ బార్లు, క్లబ్బులు, పబ్బులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లకు వెళ్ళేవారు విచక్షణ కలిగినవారు. ఆలోచించే స్థాయి ఉన్నవారు. జాగ్రత్తలు తీసుకునే చైతన్యం ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వారే జాగ్రత్తలు తీసుకోవాలి. మూసివేస్తే యజమానులకు పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు. కానీ అందులో నెల జీతాలకు పనిచేసే వేలాది మంది జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూలు పరిష్కారమూ కాదు, అమలు కూడా కష్టం.


Next Story

Most Viewed