సెకండ్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ బంద్

62

దిశ, తెలంగాణ బ్యూరో :  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ సెకండ్ డోస్ శనివారం, ఆదివారం ఉండదని, కొత్త మార్గదర్శకాలతో సోమవారం తిరిగి మొదలవుతుందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా కేవలం సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే జరుగుతున్నందున ఈ నెల చివరి వరకూ అదే విధానం కొనసాగుతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో రెండో డోసు తీసుకోడానికి ప్రస్తుతం ఉన్న ఆరు వారాల గడువును రెట్టింపు చేసి పన్నెండు వారాలకు పెంచినందున తెలంగాణలో దాన్ని అమలు చేయడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. అవి రూపొందిన తర్వాత వాటి వెలుగులోనే వ్యాక్సినేషన్ తదుపరి కార్యాచరణపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

కొవిషీల్డ్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఇప్పటిదాకా ఆరు వారాల లోపు సెకండ్ డోస్ తీసుకునే అవకాశం ఉంది. కానీ దీన్ని పన్నెండు వారాలకు పెంచినందున రాష్ట్రంలో మొదటి డోస్ తీసుకున్న లబ్ధిదారులకు ఇప్పుడు హడావిడిగా సెకండ్ డోస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరో ఆరు వారాల వరకూ సెకండ్ డోస్ (కొవిషీల్డ్) జోలికి పోనవసరం లేదు. ఈ ఆరు వారాలు వ్యాక్సినేషన్‌ను అమలు చేయకుండా తాత్కాలిక విరామం ఇవ్వడానికి బదులు అర్హులైనవారికి ఫస్ట్ డోస్‌ ఇవ్వవచ్చన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే దాదాపు 45 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకోడానికి (45 ఏళ్ళ వయసు పైబడిన) సిద్ధంగా ఉన్నందున పరిమిత స్టాక్‌తో ప్రక్రియను మొదలుపెడితే మధ్యలోనే ఆపేయాల్సి ఉందన్న అనుమానం వైద్యారోగ్య శాఖ వర్గాల్ల వ్యక్తమైంది.

ఈ ప్రత్యేక పరిస్థితుల్లో శనివారం, ఆదివారం వ్యాక్సిన్ ప్రక్రియకు విరామం ప్రకటించిన డైరెక్టర్ సోమవారం కొత్త మార్గదర్శకాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నారు. ఆ మార్గదర్శకాల్లో ఏమేం కొత్త అంశాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..