వామ్మో.. 4,259 మంది పోలీసులకు కరోనా

by  |
వామ్మో.. 4,259 మంది పోలీసులకు కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లలో ఒకరిగా ఉన్న పోలీసుల్లో రాష్ట్రంలో గరిష్ఠ స్థాయిలో వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రం మొత్తం మీద 4,259 మంది పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 43 మంది చికిత్స పొందుతూ మరణించారు. పాజిటివ్ పేషెంట్లలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో 1,946 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 340 మంది ఉన్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసే 209 మందికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇక మృతుల్లో 23 మంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండగా మరో 17 మంది వివిధ జిల్లాల్లో ఉన్నారు. మరో ముగ్గురు కరోనాగా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారు. పోలీసు శాఖలో రాష్ట్ర హోంమంత్రి మొదలు హోంగార్డు వరకు కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ నెల 11వ తేదీ రాత్రి వరకు వివిధ జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ నెల 12వ తేదీన ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ గణాంకాలను పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద 4,259 మంది కరోనా బారిన పడితే అందులో ఇప్పటికీ 3,366 మంది యాక్టివ్ పేషెంట్లుగానే ఉన్నారని, ఇందులో కొద్దిమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఎక్కువ మంది హోమ్/ఇన్‌స్టిట్యూషన్‌లలో క్వారంటైన్/ఐసొలేషన్‌లో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది.

వెస్ట్ జోన్‌లోనే ఎక్కువ పాజిటివ్‌లు

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 11వ తేదీ వరకు మొతం 1,946 మంది సిబ్బంది కరోనా బారిన పడితే ఇందులో గరిష్ఠంగా 311 మంది వెస్ట్ జోన్ పరిధిలోనూ, ఆ తర్వాత 296 మంది సెంట్రల్ జోన్‌లోనూ ఉన్నారు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో 256 మంది, ట్రాఫిక్ విభాగంలో 244 మంది చొప్పున ఉన్నారు. సీసీఎస్ విభాగంలోనూ 50 మందికి వైరస్ సోకింది. సెంట్రల్ సెక్యూరిటీ వింగ్‌లో సైతం 57 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. ఈస్ట్ జోన్‌లో 155 మంది, నార్త్ జోన్‌లో 169 మంది, సౌత్ జోన్‌లో 194 మంది చొప్పున ఉన్నారు.

ఇక ర్యాంకులవారీగా చూస్తే అత్యధికంగా 1,098 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 436 మంది హోంగార్డులు, 111 మంది ఎస్ఐలు, 105 మంది ఏఎస్ఐలు, 112 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు 33 మంది ఉండగా ఆరుగురు ఏసీపీలు, ఒక అడిషనల్ డీసీపీ (సీసీఎస్ విభాగం) ఉన్నారు. మృతుల్లో మాత్రం ఎక్కువగా సెంట్రల్ జోన్‌లో ఏడుగురు, ఆ తర్వాత వెస్ట్ జోన్‌లో ఐదుగురు, నార్త్ జోన్‌లో నలుగురు చొప్పున ఉన్నారు. సెంట్రల్ సెక్యూరిటీ వింగ్‌లో కూడా ఒకరు కరోనా కారణంగా చనిపోయారు. పోలీసు సిబ్బంది ద్వారా వారి కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువ సంఖ్యలోనే పాజిటివ్ వచ్చినట్లు నివేదిక పేర్కొంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్‌లో కేవలం 194 మంది పోలీసులకు మాత్రమే కరోనా పాజిటివ్ వస్తే వారి ద్వారా కుటుంబాల్లోని వారికి కూడా సోకి మొత్తం 435 మందికి అంటుకున్నట్లు పేర్కొంది. ఈ నివేదికను రూపొందించిన స్పెషల్ బ్రాంచ్‌లోనూ 74 మందికి పాజిటివ్ వస్తే అందులో 32 మంది పోలీసు కానిస్టేబుళ్లే.

మృతుల్లో 18 మంది ప్రభుత్వాసుపత్రుల్లోనే

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన పోలీసు సిబ్బందిలో 18 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయినవారే. ఎక్కువ మంది గాంధీ ఆసుపత్రిలో చనిపోతే కొద్దిమంది చెస్ట్, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో చనిపోయారు. ఇద్దరు మాత్రం ఇంటిదగ్గర చనిపోగా మిగిలినవారు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చనిపోయారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మే నెలలో కుల్సుంపుర స్టేషన్‌కు చెందిన దయాకర్‌రెడ్డి చనిపోగా జూన్ నెలలో ఆరుగురు, జూలై నెలలో పన్నెండు మంది, ఆగస్టు నెలలో నలుగురు చనిపోయారు. జిల్లాల్లో మాత్రం పన్నెండు మంది జూలై నెలలో, మిగిలిన ఐదుగురు ఆగస్టు నెలలో చనిపోయారు. వీరిలో చాలా మందికి బీపీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నట్లు స్పెషల్ బ్రాంచ్ ఆ నివేదికలో పేర్కొంది.

వరంగల్ జిల్లాలోనూ గణనీయంగా పాజిటివ్

రాష్ట్రంలోని పోలీసు శాఖలో ఎక్కువగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పాజిటివ్ బారిన పడగా ఆ తర్వాతి స్థానంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 340 మందికి వైరస్ సోకింది. రాచకొండ పరిధిలో 227 మంది, సైబరాబాద్ పరిధిలో 143 మందికి సోకింది. వరంగల్ పరిధిలోని 340 మందిలో ఎనిమిది మంది మినహా మిగిలిన 332 మంది ఇంకా యాక్టివ్ పాజిటివ్‌గానే ఉన్నారు. సైబరాబాద్ పరిధిలోని 143 మందిలో 101 మంది ఇంకా యాక్టివ్ పేషెంట్లుగానే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 146 మంది, నల్లగొండలొ 105 మంది, సంగారెడ్డిలో 93 మంది, కరీంనగర్‌లో 91 మంది, రామగుండంలో 85 మంది, కామారెడ్డిలో 83 మంది, మహబూబాబాద్‌లో 81 మంది చొప్పున పోలీసులు కరోనా బారిన పడ్డారు.

యూనిట్ల వారీగా పోలీసు శాఖలో కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్: 1856
సైబరాబాద్: 143
రాచకొండ: 227
ఆదిలాబాద్: 36
కొత్తగూడెం: 41
భూపాలపల్లి: 7
జగిత్యాల: 32
గద్వాల: 29
కామారెడ్డి: 83
కరీంనగర్: 91
ఖమ్మం: 41
ఆసిఫాబాద్: 22
మహబూబాబాద్: 81
మహబూబ్‌నగర్: 62
మెదక్: 18
ములుగు: 49
నాగర్‌కర్నూల్: 21
నల్లగొండ: 105
నారాయణపేట్: 18
నిర్మల్: 35
నిజామాబాద్: 146
సిరిసిల్ల: 12
రామగుండం: 85
సంగారెడ్డి: 93
సిద్దిపేట: 52
సూర్యాపేట: 46
వికారాబాద్: 32
వనపర్తి: 26
సీఐడీ: 2
డీజీపీ ఆఫీస్: 3
ఇంటెలిజెన్స్: 209
ఐబీ: 1
ఎస్పీఎఫ్: 36
స్పెషల్ పోలీస్: 96
డీటీసీ: 60


Next Story