ప్రైవేటు ఆస్పత్రుల్లో రాపిడ్ టెస్టులు

by  |
ప్రైవేటు ఆస్పత్రుల్లో రాపిడ్ టెస్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఇంతకాలం ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో మాత్రమే టెస్టులు చేస్తుండగా ఇక నుంచి రాపిట్ యాంటీజెన్ టెస్టులు కూడా చేసుకోవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అనుమతులు ఇచ్చింది. అర్హత కలిగిన ప్రైవేటు లాబ్‌లు, ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సర్క్యులర్ జారీ చేసింది. రాపిడ్ టెస్టుకు రూ. 500కు మించి వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ సర్జరీలు, ఇతర వైద్య చికిత్సలు ప్రారంభించే ముందు విధిగా హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి పరీక్షలు చేస్తున్నట్లుగానే ఇకపైన కరోనా ఉందో లేదో నిర్ధారించుకోడానికి రాపిడ్ యాంటీజెన్ టెస్టులు కూడా చేసుకోడానికి అనుమతి లభించినట్లయింది.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 220కు పైగా ఆస్పత్రుల్లో కరోనా కేసులకు వైద్య సేవలు లభిస్తున్నాయి. యాభైకు పైగా లాబ్‌లలో కరోనా నిర్ధారణ (ఆర్‌టీ-పీసీఆర్) పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పద్ధతిలో టెస్టులు చేయడం ద్వారా ఒకరోజు తర్వాత రిపోర్టులు వస్తున్నాయి. దీంతో అత్యవసర కేసుల విషయంలో వైద్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు యాంటీజెన్ టెస్టులకు అనుమతి లభించడం ద్వారా కేవలం అరగంటలోనే పేషెంట్లకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది. దీంతో వెంటనే చికిత్స ప్రారంభం కావడానికి వీలు కలుగుతోంది. చాలా ఆసుపత్రుల్లో అత్యవసర కేసులు వచ్చినప్పుడు వెంటనే చికిత్స ప్రారంభించడానికి నిర్దిష్టంగా ఆ పేషెంట్‌కు కరోనా ఉందో లేదో తేల్చుకోడానికి వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కరోనా ఉన్నట్లయితే మిగిలిన పేషెంట్లకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి తొలుత దాన్ని నిర్ధారణ చేసుకోడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో మాత్రమే టెస్టు చేయించుకోవాలన్న నిబంధన ఉండడంతో ఒక రోజు వరకు చికిత్స ప్రారంభించడానికి ఆలస్యమయ్యేది. ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి యాంటీజెన్ టెస్టులు చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరినా ఇంతకాలం సానుకూల స్పందన రాలేదు. ఐసీఎంఆర్ ఇటీవల మార్గదర్శకాలను వెలువరించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోకతప్పలేదు.

రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్న కరోనా టెస్టుల్లో దాదాపుగా అన్నీ రాపిడ్ యాంటీజెన్ పద్ధతిలో జరుగుతున్నవే. ప్రైవేటు లాబ్‌లకు యాంటీజెన్ టెస్టులు చేసుకోడానికి అనుమతి లేనందువల్ల అన్నీ ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తంమీద జరుగుతున్న సుమారు 40 వేలకు పైగా పరీక్షల్లో దాదాపు 95% రాపిడ్ టెస్టులే. ఇప్పుడు ప్రైవేటుకు కూడా రాపిడ్ టెస్టులు చేసుకోడానికి అనుమతి లభించినందువల్ల ఏరోజుకారోజు టెస్టుల వివరాలను ప్రజారోగ్య శాఖకు పంపాల్సిందిగా సర్క్యులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్‌టీ-పీసీఆర్ ధరలను రూ. 850, ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకెళ్తే రూ. 1200 చొప్పున మాత్రమే వసూలు చేయాలంటూ ప్రభుత్వమే ధరలను ఖరారు చేసినందున రాపిడ్ టెస్టుకు కూడా రూ. 500 ఫీజును ఖరారు చేసింది. హోల్‌సేల్ ధరల్లో ఒక్కో యాంటీజెన్ కిట్ ధర రూ. 275 ఉండడంతో ప్రభుత్వం రూ. 500గా ఖరారు చేసింది.


Next Story

Most Viewed