కేస్లాపూర్ లో నాగుల పంచమి పూజలు క్యాన్సిల్..

by  |
కేస్లాపూర్ లో నాగుల పంచమి పూజలు క్యాన్సిల్..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదివాసుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా జాతర ఈ ఏడాది నాగ పంచమి వేడుకలకు దూరం అవుతోంది. ఏటా మూడు రోజులు జరిగే కేస్లాపూర్ జాతర, దర్బార్ తర్వాత అదే స్థాయిలో నిర్వహించే నాగుల పంచమి వేడుకలకు కరోనా అడ్డుపడింది. ఈ నెల 25న కేస్లాపూర్‌లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించాల్సిన నాగుల పంచమి పండుగ జరపవద్దని నిర్ణయం తీసుకున్నారు. నాగోబా ఆలయ వంశపారంపర్య నిర్వాహకులయిన మెస్రం వంశీయులు ఒక సమావేశాన్ని నిర్వహించి పంచమి వేడుకలకు దూరంగా ఉండాలని ఆదివాసులను కోరారు. కరోనా కారణంగా నాగుల పంచమి నిర్వహించవద్దని వారు తీసుకున్న నిర్ణయంతో ఆదివాసులలో నిరాశ నెలకొంది.

ఏటా ఘనంగా..
ప్రతి యేటా నాగుల పంచమి పండగ సందర్భం గా కే స్లాపూర్ నాగోబా సందడిగా ఉండేది. ఉట్నూరు ఏజెన్సీ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు, సాంప్రదాయ భక్తులు భారీగా హాజరయ్యేవారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కేస్లాపూర్ నాగ పంచమి వేడుకలకు తరలి వచ్చేవారు. నాగుల పంచమి ఒకేరోజు 50 వేలకు పైగా భక్తులు వచ్చేవారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది నాగోబాకు పాలు పోసి, పంచమి వేడుకలు నిర్వహించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాగోబా కరుణించాలని..
కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం అయినప్పటి నుంచి మాకు ఊహ తెలిసి తొలిసారిగా భక్త జన సందోహం లేకుండా నాగ పంచమి వేడుక నిర్వహించాల్సి వస్తుందని మెస్రం వంశీయులు తెలిపారు. అయితే పరిమిత సంఖ్యలో నాగోబాకు సాంప్రదాయ పద్దతిలో మొక్కులు చెల్లిస్తామని ఆలయ పెద్ద మనోహర్ చెప్పారు. కాగా కొండకోనల్లో ఆదిమ గిరిజనులు ఎంతో సంబురంగా నిర్వహించుకునే నాగుల పంచమి వేడుకలపై కరోనా ప్రభావంతో ఆదివాసుల్లో నిరాశ కలిగిస్తోంది.



Next Story

Most Viewed