ప్రాణాలు పోతున్నాయ్.. కరోనాకు తోడు ఐపీఎల్ బెట్టింగ్

by  |
ప్రాణాలు పోతున్నాయ్.. కరోనాకు తోడు ఐపీఎల్ బెట్టింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల ప్రాణాలు పోతుంటే, మరోవైపు ఐపీఎల్ బెట్టింగ్ వలన కొందరు యువకులు బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు.చిన్న పెద్ద అనే తేడా లేకుండా దేశప్రజలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. కొందరు చికిత్స అనంతరం కోలుకుంటుంటే మరికొందరు మృతి చెందుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా రెట్టింపు సంఖ్యలో పెరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఐపీఎల్ బెట్టింగ్ కూడా జోరందుకుంది.

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు జోరుగా బెట్టింగులు వేస్తున్నారు. ఈ దందా కొందరికి కాసులు కురిపిస్తుంటే మరికొందరికీ చుక్కలు చూపిస్తోంది. బెట్టింగ్ మత్తులో పడి ఆస్తులు పొగొట్టుకుంటున్నారు. మరొకొందరు డబ్బులు చెల్లించలేక.. బుకీల టార్చర్ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకీలతో పాటు పలువురు యువకులు అరెస్టైన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోకి గుంటూరు జిల్లాలో గురువారం ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్‌లు పెడుతూ ఇంట్లోని డబ్బులు వృథా చేస్తున్నాడని యువకుడి తల్లి తీవ్రస్థాయిలో మందలించింది. దీంతో మనస్థాపం చెందిన యువకుడు తన మిత్రుడు ఫ్లాట్‌కు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడి లాగా మరెవరు బెట్టింగ్‌కు బలవకుండా ఉండాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు కోరారు.

Next Story

Most Viewed