ఉస్మానియాలో కరోనా డేంజర్ బెల్స్.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ!

by  |
ఉస్మానియాలో కరోనా డేంజర్ బెల్స్.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ!
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ప‌దుల సంఖ్యలో వైద్యులు, సిబ్బంది వైర‌స్ బారిన ప‌డుతున్నారు. పీజీ చ‌దువుతున్న వైద్య విద్యార్థుల్లో ఇటీవ‌ల ఒకరికి క‌రోనా ల‌క్షణాలు క‌న్పించ‌డంతో వైద్య ప‌రీక్షలు నిర్వహించారు. ఆర్ధో విభాగంలోనూ ఇద్దరు పీజీ మెడికోలకు, జ‌న‌ర‌ల్ స‌ర్జరీలో ఇద్దరు పీజీ విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. ఆర్థో విభాగంలో ఓ అసోసియేట్ ప్రొఫెస‌ర్‌కు క‌రోనా వ్యాధి ల‌క్షణాలు క‌న్పించ‌డంతో ఆయ‌నకు వైద్య ప‌రీక్షలు చేశారు. ఇలా ఆస్పత్రిలోని ప్రతి విభాగంలో ఒక‌రు, ఇద్దరు చొప్పున క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఆస్పత్రిలో చాప కింద నీరులా రోజురోజుకూ వైర‌స్ తీవ్రత‌రం అవుతుండ‌టంతో విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు వైద్యులు, సిబ్బంది, చికిత్స కోసం వ‌చ్చేందుకు రోగులు భయాందోళనకు గురవుతున్నారు.

రెండోసారి వ్యాక్సిన్ వేసుకున్న పీజీ విద్యార్థికి కూడా…
ఉస్మానియా ఆస్పత్రిలోని ఆర్థో విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ పీజీ విద్యార్థి రెండు ప‌ర్యాయాలు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండ‌వ డోస్ వేసుకున్న సుమారు మూడు వారాల అనంత‌రం స‌ద‌రు పీజీ వైద్య విద్యార్థిలో కోవిడ్ ల‌క్షణాలు క‌న్పించాయి. దీంతో ప‌రీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న ఇత‌ర వైద్యులు, సిబ్బంది కూడా ఆందోళ‌న చెందుతున్నారు.

నిర్లక్ష్యమే కొంప ముంచుతోందా…?

హాస్పిట‌ల్‌లో చాలా మంది ప్రొఫెస‌ర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, పీజీ విద్యార్థులు, న‌ర్సింగ్, పారా మెడిక‌ల్ సిబ్బంది సిబ్బంది ఇలా చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్నాం, ఇక కరోనా వైర‌స్ ఏమీ చేయ‌లేద‌నే ధీమాతో వారు మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డం, సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం, శానిటైజ‌ర్ వినియోగించ‌క‌పోవ‌డం వంటివి చేస్తున్నారు . దీంతో వారి నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారుతోంది. రోగుల‌కు క‌రోనా విష‌యంలో మార్గ నిర్ధేశ్యం చేయ‌వ‌ల‌సిన వైద్యులు, సిబ్బంది కోవిడ్ నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌క పోవ‌డంతో ఇటీవ‌ల కాలంలో హాస్పిట‌ల్ లో క‌రోనా కేసులు నిత్యం పెరిగిపోతున్నాయి. ఇలా ఉస్మానియా హాస్పిట‌ల్‌లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని త‌దుప‌రి వైద్య చికిత్సల నిమిత్తం కింగ్ కోఠికి జిల్లా ఆస్పత్రికి త‌ర‌లించి వైద్య సేవ‌లు అందిస్తున్నారు.


Next Story

Most Viewed