కరోనా ‘మహా’ ముప్పు.. ఆ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్

105

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పొరుగు రాష్ట్రంలో వైరస్​విజ‌ృంభిస్తుండడంతో.. సరిహద్దున ఉన్న మండలాలకు ‘మహా’ ముప్పు పొంచి ఉంది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులుగా ఎక్కువ భాగం మహారాష్ట్రకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి నుంచి జిల్లాలోని చాలా ప్రాంతాలకు జనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో వైరస్​ముప్పు మనకు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దు రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే జిల్లాలోకి అనుమతించాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మహారాష్ట్రతో విడదీయరాని బంధం

ఉమ్మడి ఆదిలాబాద్ పరిధి నాలుగు జిల్లాలకు సరిహద్దులుగా మహారాష్ట్రనే ఉండగా.. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు రోడ్డు మార్గాన రాకపోకలు సాగిస్తుంటారు. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లాకు ప్రాణహిత నది మీదుగా పడవల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపార, వాణిజ్య అవసరాలతో పాటు కుటుంబపరమైన సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్పత్రులు, ఇతర వ్యాపార సంబంధాలు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో నిత్యం వేలాది మంది వేలాది ఉమ్మడి జిల్లాకు వచ్చి పోతుంటారు. ఇక్కడి వారు సైతం మహారాష్ట్రకు వెళ్తుంటారు. నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి భోకర్, నాందేడ్, ధర్మాబాద్ తదితర ప్రాంతాలకు సంబంధాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా భోథ్ కు మహారాష్ట్రలోని కిన్వట్, జైనథ్, బేల, ఆదిలాబాద్ ప్రాంతాలకు చంద్రాపూర్, యావత్మాల్, నాగ్​పూర్​తదితర ప్రాంతాలతో రాకపోకలున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాలతో సంబంధాలున్నాయి.

మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వారు కూడా నిత్యావసరాల కోసం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చి పోతుంటారు. యావత్మాల్, చంద్రాపూర్, నాందేడ్, నాగ్​పూర్​, గడ్చిరోలి జిల్లాల నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాలకు ఆస్పత్రులతో పాటు వ్యాపార సంబంధాల నిమిత్తం వచ్చిపోతుంటారు. నిత్యం మహారాష్ట్రకు బియ్యం వెళ్తుండగా.. అక్కడి నుంచి గోధుమలు ఇక్కడికి తెచ్చి విక్రయిస్తుంటారు. అక్కడికి.. ఇక్కడి మధ్య వివాహ బంధాలు, విద్యాపరంగా కూడా చాలా సంబంధాలున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో మహారాష్ట్ర విద్యార్థులు వచ్చి చదువుతుండగా.. అక్కడికి కూడా మన విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు. నిత్యం ఇరుప్రాంతాల మధ్య లక్షలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందగా.. ఆ పదం వింటేనే వారిని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా యావత్మాల్, చంద్రాపూర్, నాగ్​పూర్, గడ్చిరోలి, నాందేడ్ జిల్లాల్లో తాజాగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప్రజలకు కరోనా భయం లేకుండా ఉండేది. మాస్కులు లేకుండా, శానిటైజర్లు వేసుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరిగారు. తాజాగా మహారాష్ట్ర నుంచి సరిహద్దు ప్రాంతాలకు ‘మహా’ ముప్పు పొంచి ఉండడంతో.. మళ్లీ అంతా అప్రమత్తమవుతున్నారు.

అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం

తాజాగా మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్​మోగడంతో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్కులు, శానిటైజర్లు లేకుండా బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం టీకా ఫ్రంట్ లైన్ వారియర్లకే ఇస్తున్నారు. దీంతో మిగతా వారంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఇది కరోనా వైరస్ వ్యాప్తికి అనుకూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్​నిబంధనలు పాటించకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, గ్రామాల్లో గతంలో మాదిరిగానే చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే ఉమ్మడి జిల్లాలోని అనుమతించాలని, విరివిరిగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ప్రజలు విన్నవిస్తున్నారు. దీంతోపాటు గతంలో మాదిరిగానే లాక్​డైన్​నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..