కర్ఫ్యూ పెట్టాక కేసులు ఎలా పెరిగాయ్ : హైకోర్టు

by  |
కర్ఫ్యూ పెట్టాక కేసులు ఎలా పెరిగాయ్ : హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ పెట్టిన తర్వాత కూడా కేసులు, మరణాలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించింది. కరోనా లెక్కలపైనా, సంభవిస్తున్న మరణాలపైనా ప్రభుత్వం ఇస్తున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. కరోనా నిబంధనలను పటిష్టంగా అమలుచేస్తామని చెప్పిన ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలో కేవలం నాలుగే కేసుల్ని నమోదు చేసిందా అని ప్రశ్నించింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జనం గుమికూడకుండా ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా కేసుల కారణంగా ఆంబులెన్సులపై వత్తిడి పెరిగినందున మృతదేహాల తరలింపుకు గుర్రాలను వాడాలని ప్రభుత్వానికి సూచించింది. ఇప్పుడే కరోనా కేసులు ఇంత భారీగా పెరుగుతూ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ పూర్తయ్యేటప్పటికి ఇంకా పెరుగుతాయన్న ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో వేల సంఖ్యలో పేషెంట్లు చేరుతున్నందున రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, రెమిడెసివిర్ మందులకు ఏర్పడిన కొరత తదితరాలపై గణాంకాలతో సహా వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ జిల్లాలో ఏ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయో ప్రతీ రోజూ బులెటిన్‌లో వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. మాస్కు లేకుండా తిరుగుతున్నవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఐసొలేషన్‌లో ఉన్న పేషెంట్లకు సాయం చేయడానికి రూపొందించిన ‘హితం‘ మొబైల్ యాప్‌ను మళ్ళీ పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ఆంబులెన్స్ సర్వీసులను ఉచితంగా నడపాల్సి ఉన్నప్పటికీ పేషెంట్ల నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించింది. పోలింగ్ రోజున బూత్‌ల దగ్గర తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

అఫిడవిట్‌కు, ఆచరణకు పొంతన లేదు..

తెలంగాణ ప్రభుత్వం‌ అఫిడవిట్ రూపంలో ఇస్తున్న వివరాలను క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు చాలా తేడా ఉండదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కట్టడి కోసం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదని, ప్రజలు గుమికూడకుండా, రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంట్రోల్ రూమ్ కోసం మరిన్ని టోల్-ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల విషయంలో గతంలో హైకోర్టు ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోలేదని, ఆదేశాలు జారీ చేసినా అమలు చేయడలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఎక్కువ సంఖ్యలో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల్ని చేయాలని, 24 గంటల వ్యవధిలోనే రిపోర్టులను పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఆక్సిజన్‌కు ఏర్పడిన కొరతను ప్రస్తావించిన హైకోర్టు వాస్తవ పరిస్థితిని అఫిడవిట్‌లో స్పష్టం చేయాలని పేర్కొంది. విమానాల ద్వారా ఆక్సిజన్‌ను తెప్పించుకుంటున్న చర్యలు, వాటి ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆక్సిజన్ వివరాలను తెలియజేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అవసరాలకు తగినంత మోతాదులో ఆక్సిజన్‌ను తరలించాలని సూచించింది. కరోనా సమయంలో వృద్ధులు, వికలాంగులకు కొన్ని ప్రత్యేక సమస్యలు ఉన్నాయని, వారికి టెస్టులు, టీకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, డీజీపీ ఇందుకు చొరవ తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

పోలీసుందరూ తప్పనిసరిగా మాస్కు వాడాల్సిందేనని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ఆయనకు నూచించింది. పోలీస్ శాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనల్లో ప్రధానమైన సోషల్ డిస్టెన్స్ విషయంలో ఇప్పటివరకూ కేవలం నాలుగే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి నొక్కి చెప్పిన హైకోర్టు ఇదే చివరి అవకాశం అని హెచ్చరించింది. పూర్తి వాస్తవిక గణాంకాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించి తదుపరి విచారణను మే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.

Next Story

Most Viewed