బతుకు ‘చక్రం’కు కరోనా బ్రేకులు.. కష్టాల్లో క్యాబ్ డ్రైవర్లు

122
Cab drivers

దిశ, తెలంగాణ బ్యూరో : బతుకు బండికి బ్రేక్​ పడింది. ప్రతీ రోజూ గిర్రున తిరిగే జీవన చక్రం ఒక్కసారిగా ఆగిపోయింది. బతుకు బండి లాక్‌ అయింది. బతుకు డౌన్‌ అయింది. కార్లపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలను అతలాకుతలం చేసింది. అంతటా రవాణా ఆగిపోవడంతో వారి బతుకు ఆగమ్యగోచరంగా మారింది. సాధారణంగా ఫైనాన్స్‌పై తీసుకుని నడిపే వాహనాలే అధికంగా ఉంటాయి. నెల తిరిగే సరికి తిన్నా తినకపోయినా బ్యాంకులకు, ఫైనాన్స్‌ సంస్థలకు కిస్తీలు కట్టాల్సిందే. కిరాయిలకు వెళ్లే పరిస్థితి లేదు.

ఇప్పటికే గతేడాది తీవ్ర నష్టాలను మిగిల్చింది. దాదాపు వాహనాలను అమ్ముకున్నారు. కొంతమంది ఏకంగా ఈ ఫీల్డ్​నే వదిలేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి గడ్డు కాలమే ఎదురవుతోంది. ఇప్పటికే నెలల తరబడి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. కొంత ఉపశమనం లభించిందనే సమయంలో అటు డీజిల్​ భారం నెత్తిన పడింది. ఎలాగో నెట్టుకొస్తామనే సమయంలో ఇప్పుడు లాక్​డౌన్​ మళ్లీ లాక్​ వేసింది.

రవాణా రంగం ఆగమాగం

కరోనా ఆర్థిక పునాదుల్ని పెకిలించి చిన్నాభిన్నం చేసింది. లాక్‌డౌన్‌ అమలుతో రవాణారంగం అతలాకుతలమైంది. ప్రధానంగా ట్యాక్సీ యజమానులు అప్పులపాలయ్యారు. కనీసం నిర్వహణకు పైసా ఆదాయం లేకుండా పోయింది. దీంతో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నుంచి రవాణా రంగం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. క్యాబ్‌ డ్రైవర్లను కరోనా లాక్‌డౌన్‌ చేసింది. గత ఏడాది నాలుగైదు నెలలు ఎక్కడి కార్లు అక్కడే ఆగిపోవడంతో బతుకుబండి నడవడం కష్టమైంది.

కొంతకాలం రోడ్డెక్కినా కొత్త కష్టాలు వెంటాడాయి. కరోనా భయం, డీజిల్ ధరలు పెంపుతో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వల్ల జనం క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కడం తగ్గించడంతో డ్రైవర్లందరికీ పని కరువైంది. ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రం హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తుండటంతో వీళ్లకు వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా పోయింది. వస్తున్న ఆ కాస్త గిరాకీ పైసలు కూడా పెరిగిన పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లకే సరిపోతుండటంతో డ్రైవర్లు ఆగమైతున్నారు. దీంతో కొందరు వేరే చిన్నాచితకా పనులు వెతుక్కుంటుంటే ఇంకొందరు కార్లను అమ్ముకుంటున్నారు. చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒక వైపు క్యాబ్‌లో ముగ్గురు ప్రయాణికులతో ప్రయాణించాలనే నిబంధనలు, మరోవైపు మెజార్టీ ఐటీ కంపెనీలకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వడంతో ప్రయాణికులు లేక వెలబోయాయి.

గతంలో మాములు రోజుల్లో రోజుకు రూ. 1000 నుంచి రూ. 1500 సంపాదించేవారు. తాజా పరిస్థితుల్లో మొన్నటి వరకూ రూ.400 కూడా రాలేదు. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌తో చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది. కనీసం పాలప్యాకెట్‌ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు.

ఇప్పుడెలా..?

రాష్ట్రంలో ప్రైవేట్​ వాహన రంగంపై ఆధారపడి 4 లక్షల మంది వరకు ఉండగా… గతేడాది కరోనా పరిస్థితుల్లో దాదాపు 50 వేల మంది వరకు ఈ ఫీల్డ్​కు దూరమయ్యారు. ఇదే సమయంలో రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​ ఆంక్షలు రావడంతో ఇప్పుడు జీవనం సాగించే పరిస్థితులు కూడా లేవంటున్నారు. గ్రేటర్​ పరిధిలోనే దాదాపు 1.10 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా స్థానికంగా ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే సొంతూళ్లకు వెళ్తున్నారు. క్యాబ్​ డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

బతుకలేని పరిస్థితుల్లో ఉన్నాం

కరోనా పరిస్థితుల్లో మా బతుకులు దుర్భరంగా మారాయి. ఈ రంగంపై ఆధారపడిన చాలా మంది మూడు పూటలా తిండి కోసం కష్టపడుతున్నారు. గత ఏడాది కరోనాతో చితికిపోయాం. ఈ ఏడాదైనా కలిసి వస్తుందనుకుంటే ఇప్పుడూ అదే పరిస్థితి. ఢిల్లీ ప్రభుత్వం చేసినట్టే రాష్ట్రంలో కూడా ఆదుకోవాలి.
– ఆంజనేయులు, తెలంగాణ క్యాబ్​ డ్రైవర్స్, ఓనర్స్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..