మళ్లీ కరోనా కలకలం.. విద్యా, ఐటీ సంస్థల్లో తీవ్రత

by  |
Corona Test
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యా, ఐటీ సంస్థల్లో వ్యాప్తి పెరిగినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఇప్పటికే కరోనా నిబంధనలు పాటించాలని అనేక సార్లు సూచించినా, ఆయా సంస్థల నిర్లక్ష్యంతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్కూళ్లల్లోని చిన్నారుల నుంచి పెద్దలకు వైరస్​అంటుకుంటున్నది. ఐటీ సంస్థల నుంచి ఆయా కుటుంబాల్లో వ్యాప్తి పెరుగుతున్నది. ఇది ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేసే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ స్కూళ్ల నుంచే షూరు అయింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో నవంబరు నుంచే కేసులు తేలడం మొదలయ్యాయి. అప్పట్లో గురుకులాల్లో ఏకంగా దాదాపు 400 మంది చిన్నారులు వైరస్​బారిన పడ్డారు. దీంతో పాటు ప్రైవేట్ సంస్థల్లోనూ వైరస్ తీవ్రత పెరిగింది. ఆ వ్యాప్తి క్రమంగా మార్కెట్లు, హోటళ్లలోనూ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత నాగార్జున సాగర్​ఉప ఎన్నికలు తదనంతరం కేసులు సంఖ్య పతాక స్థాయిలోకి వెళ్లాయి. దీంతో అలాంటి పరిస్థితిని తీసుకురావొద్దని అధికారులు కోరుతున్నారు. వైరస్​వ్యాప్తి చెందకుండా విద్యా, ఐటీ సంస్థలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. కేసులు తేలిన స్కూళ్లు, ఐటీ సంస్థలు ఖచ్చితంగా వైద్యశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాప్తి లింక్​ చైన్ ను తొలగించేందుకు సహకరించాలని చెబుతున్నారు. ఐదు కేసులు నమోదైన పాఠశాలలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 104 కాల్​సెంటర్‌ను సంప్రదించాలని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

గ్రామాల్లోనూ క్రమక్రమంగా…

కరోనా కేసులు గ్రామాల్లోనూ మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్​నగర్, జిల్లాల్లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే వ్యాక్సినేషన్​అత్యధికంగా ఉన్న గ్రామాల్లో కేసులు నమోదుకాకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. దీంతో పాటు జనసాంద్రత అత్యధికంగా ఉన్న గ్రేటర్​హైదరాబాద్​జిల్లాల్లోనూ కరోనా పెరుగుతున్నది. అయితే ఎప్పటిలాగానే క్షేత్రస్థాయి పరిస్థితులకు అధికారులు వెల్లడించే కేసుల సంఖ్యకు చాలా తేడా కనిపిస్తుందని స్వయంగా మెడికల్​ఆఫీసర్లు చెబుతున్నారు. శీతల వాతావరణ పరిస్థితుల్లో సాధారణంగానే వైరస్‌ల వ్యాప్తి పెరుగుతుందని, దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆఫీసర్లు నొక్కి చెబుతున్నారు.

అక్కడక్కడ కేసులు తేలడం సహజం : హెల్త్​డైరెక్టర్​డాక్టర్ జి.శ్రీనివాసరావు

గతంతో పోల్చితే కరోనా తీవ్రత తక్కువగానే ఉన్నది. కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కేసులు తేలుతున్నాయి. ముగింపు దశలో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల స్వల్పంగా కేసులు నమోదువుతూ ఉంటాయి. భయాందోళనలు అవసరం లేదు. కానీ కొన్ని స్కూళ్లు, ఐటీ సంస్థల్లో కేసులు తేలుతున్నట్లు తెలుస్తున్నది. ఆయా యాజమాన్యాలు తప్పనిసరిగా వైద్యశాఖకు సమాచారం ఇవ్వాలి. గతంలోనే ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పాం. కొన్ని సంస్థల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. తీరు మార్చుకోపోతే చర్యలు ఉంటాయి. ఇక ఇప్పటి వరకు డోసులు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి. అంతేగాక రెండో డోసు గడువు పూర్తయిన వారూ వేసుకోవాలి. ఇప్పటి వరకు 18.86 లక్షల మంది సెకండ్​డోసుకు దూరంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సమాజ శ్రేయస్సు కొరకు బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలి. లేదంటే మరో ముప్పును చూడాల్సి వస్తుంది.


Next Story

Most Viewed