వారి దందాకు సర్కార్ అండ..? దోపిడీకి తెరలేపిన వ్యాపారులు

195
corn purchased

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా అంశాల్లో అధికారులు బిజీ ఉంటే… రైతులను నిండా ముంచడంలో వ్యాపారులు మునిగారు. వారికి తోడుగా ప్రభుత్వం కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో మక్కల రైతులను నిండా ముంచుతున్నారు. పంట చేతికి వచ్చినా అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మక్కల సాగుపై ప్రభుత్వం రెండేండ్ల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు అదే నిర్లక్ష్యంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండగా రైతులు నష్టాలపాలవుతున్నారు. ప్రస్తుతం మక్కలకు క్వింటాలుకు రూ. 1400 కూడా పెట్టడం లేదు.

కొనుగోళ్లు ఎలా మరి..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కలు, జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. గత వానాకాలం సీజన్‌లో నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం మొక్కజొన్నకు బదులుగా వేరే పంట సాగు చేయాలని, ఇకపై ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేయదంటూ ప్రకటించింది. దీంతో కొనుగోళ్ల సమయంలో రైతులు రోడ్లమీదకు వచ్చి మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పెద్దఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టింది.

ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పరిస్థితులే మొదలయ్యాయి. ఈ యాసంగి సీజన్‌లో మక్కలు, జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. పంట చేతికి రావడంతో మక్కలను, జొన్నలను రైతులు మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తక్కువ ధరకే దళారులకు, ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్ముతూ తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్రంలోని మక్క రైతుల పరిస్థితి అయోమయంలో పడింది. దిగుబడి బాగా వచ్చినా.. మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా అనుమతి ఇవ్వడం లేదు. అసలు కొంటారా..? కొనరా..? అన్న ప్రశ్నలు నెలకొన్నాయి.

వ్యాపారుల దందా..

మక్కలను మద్దతు ధరకు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ఫెడ్‌) సైతం ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదు. అయితే ముందస్తుగా ప్రస్తుత యాసంగిలో సాగుచేసిన పంటంతా మద్దతు ధరకు కొనాలంటే రూ.3,442 కోట్లు అవసరమని మార్క్‌ఫెడ్‌ లెక్క చెప్పింది. సంస్థ కొన్నేళ్లుగా కొన్న పంటల రూపేణా ఇప్పటికే రూ. 2 వేల కోట్ల నష్టాల్లో ఉందని, ఇప్పుడు సొంతంగా దేన్నీ మద్దతు ధరకు కొనే పరిస్థితి లేదని తేల్చి చెబుతోంది. మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ఆదేశిస్తే నిధులు సమకూర్చాలని, ఒకవేళ సర్కారు నిధులివ్వకపోతే ఈ సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవడానికి పూచీకత్తయినా ఇవ్వాల్సి ఉంటుందని నివేదించింది. దీంతో నిర్ణయం తీసుకోవడంపై సర్కారు వేచి చూస్తోంది.

ప్రభుత్వ జాప్యం వ్యాపారులకు వరంగా మారుతోంది. వ్యాపారులు మక్కలకు క్వింటాకు రూ.1000 నుంచి రూ.1400కి మించి ఇవ్వడం లేదు. జాతీయ మార్కెట్‌లో గిరాకీ లేదని బుకాయిస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో సాగుచేయవద్దని సీజన్‌ ఆరంభంలోనే రైతులకు చెప్పామని, ఇప్పుడు కొనుగోళ్లపై ఎలా ఉంటుందో చెప్పలేమని మరోవైపు అధికారులు దాట వేస్తున్నారు.

రాష్ట్రంలో గడిచిన యాసంగిలో మొత్తం 4.66 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. మొత్తం 15.91 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మార్కెటింగ్‌ శాఖ అంచనా వేసింది. మద్దతు ధర క్వింటాకు రూ. 1850 చొప్పున చెల్లించి కొనాలంటే మార్క్‌ఫెడ్‌ వద్ద నిధులు లేవని తేల్చింది. కేంద్రం మద్దతు ధరకు కొనే పంటల్లో మొక్కజొన్నను తెలంగాణకు అనుమతించలేదు. దీంతో రైతులను ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే కొనుగోలు చేయాల్సి ఉంది.

బడ్జెట్‌లో పంటల కొనుగోలుకు మార్కెట్‌ జోక్యం పథకం కింద ఈ ఏడాది అన్ని పంటలకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లను కేటాయించింది. అయినా ఇంతవరకూ మార్క్‌ఫెడ్‌కు రూపాయి విడుదల చేయలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మక్కల కొనుగోలుపై ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రభుత్వం అనుమతి, నిధులిస్తే కొంటామని మార్క్‌ఫెడ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. ఫలితంగా ఈసారి మక్కలు కొంటారా… లేదా అనేది ఇంకా అస్పష్టమే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..