కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. మూడేండ్లుగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

by  |
Railway underpass bridge works
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి వచ్చే రహదారిపై రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి మూడేండ్ల నుంచి నత్తనడకన సాగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018 మార్చిలో ప్రారంభమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదని మండిపడుతున్నారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి నుండి గ్రామానికి చేరుకోవాలంటే ప్రధాన మార్గం ఇదే కావటంతో బాహుపేట గ్రామస్తులతో పాటుగా తాళ్లగూడెం, పెద్దకందుకూర్, మాసాయిపేట, కాచారం గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షం వస్తే వరద నీటితో అండర్ పాస్ పూర్తిగా నిండి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటంతో జాతీయ రహదారిని చేరుకోవడానికి 10 కిలోమీటర్ల మేర తిరిగి రావల్సి వస్తోందని ఆవేదనవ వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత అధికారులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. వర్షాకాలంలో అండర్ పాస్‌లో నీళ్లు చేరడంతో అత్యవసర సమయంలో వెళ్లాలంటే అంబులెన్సులు కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. గతంలో ఒకసారి ట్రాక్టర్, కారు, ఆటో నీటిలో చిక్కుకుని ఎటూ కదలలేని స్థితిలో ఉండగా జేసీబీ సహాయంతో బయటకు తీశారు.

గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారులు అండర్ పాస్‌లోని బురదనీటిలో నుంచి వెళ్లే క్రమంలో వాహనాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది అనుకున్న సమయానికి పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ బాండ్ పేపర్ సైతం రాసిచ్చాడని, అయినా పూర్తి చేయలేకపోయాడని మండిపడుతున్నారు. గత నెలలో గ్రామానికి వచ్చిన కలెక్టర్ పమేలా సత్పతి, రోడ్డు పరిస్థితిని గమనించి కాంట్రాక్టర్‌ను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. తక్షణమే స్పందించి, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed