మమ్మల్ని రెవెన్యూలో కొనసాగించండి

by  |
మమ్మల్ని రెవెన్యూలో కొనసాగించండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా, గిర్దావర్లుగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం కోరింది. బ్రిటిష్ కాలం నుంచి గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామ అధికారుల పాత్ర గణనీయమైనదని, వారే రూపాంతరం చెంది వీఆర్వోలుగా 2008 నుంచి పని చేస్తున్నట్లు గుర్తు చేశారు. 2008 కంటే ముందు నుంచి వీఆర్ఏ నామిని వీఏఓల నుంచి పార్టు టైం ఉద్యోగులుగా పని చేసి అనేక సంవత్సరాలు ప్రజలకు, ప్రభుత్వానికి సేవలందించినట్లు అధ్యక్షుడు గరిక ఉపేంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరాలే సుధాకర్ రావు, ప్రచార కార్యదర్శి పి.ఆదిత్యలు తెలిపారు. 2002 నుంచి వేతన స్కేళ్లపై పంచాయతీ కార్యదర్శిగా, 2007 నుంచి వీఆర్వోలుగా విధులు నిర్వహిస్తున్నామన్నారు.

రెవెన్యూ శాఖలోని గ్రామ అధికారుల వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసిందన్నారు. ప్రస్తుతం కొత్త ఆర్వోఆర్ చట్టం తయారీలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేసినందున, సర్వీసు పరమైన, పదోన్నతులు, ఉద్యోగ భద్రత అంశాల్లో అభద్రత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ కార్యదర్శి నిర్ణయమే మాకు శిరోధార్యమన్నారు. కానీ ఎన్నో ఏండ్లగా ఒకే శాఖలో పని చేసి అలవాటు పడి, 45 సంవత్సరాల పైబడిన ఉద్యోగులు వేరే శాఖలో పని చేయడం మానసిక వ్యథతో కూడినదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే వివిధ పోస్టుల్లో కొనసాగించాలని కోరారు. అర్హత కలిగిన వారిని సీనియర్ సహాయకులుగా, గిర్దావర్లుగా పదోన్నతుల ద్వారా నియమించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.


Next Story