అభ్యర్థి లేకున్నా కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్.. సీనియర్ నేత వ్యూహం అదేనా..?

by  |
congress-flag
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అధికారికంగా ఆ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకున్నా క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. పార్టీకి చెందిన వారు బరిలో నిలిచినప్పటికీ స్వతంత్రులుగానే పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. రెండు రోజుల క్రితం వరకూ స్తబ్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

మంథని నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన సుమారు 40 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం ప్రత్యేకంగా తూర్పు డివిజన్‌లోని ఐదు మండలాలైన మహదేవపూర్, పల్మెల, కాటారం, మహాముత్తారం, మల్హర్, మంథని, ముత్తారం, కమాన్‌పూర్, రామగిరి మండలాలకు చెందిన మండల, జిల్లా పరిషత్ సభ్యులు, మంథని మున్సిపాలిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సుమారు 40 మందిని క్యాంపులకు తరలించారు. మంగళవారం రాత్రిలోపు కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరందరిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. మహదేవపూర్ ప్రాంత ఓటర్లకు ఇంఛార్జీగా భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి, మంథని ప్రాంతానికి చెందిన వారికి తిరుపతి యాదవ్‌లకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

శ్రీధర్ బాబు వ్యూహం ఏంటో..?

అయితే బరిలో పార్టీ అభ్యర్థి లేకున్నప్పటికీ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు క్యాంపు ఏర్పాటు చేయాలని కేడర్‌కు ఆదేశాలు జారీ చేయడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే అంతు చిక్కకుండా పోయింది. మంథని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇనుముల సతీష్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఆయనకు అనుకూలంగానే ఈ క్యాంపు ఏర్పాటు చేశారని అంటున్నారు మంథని కాంగ్రెస్ నాయకులు. అయితే ఒక ఓటు సతీష్‌కు వేస్తే మరో ఓటు ఎవరికీ వేయమంటారోనన్నది అంతుచిక్కకుండా పోయింది. మంథని నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండడంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఒక్క తాటిపై ఉన్నారని తేల్చి చెప్పేందుకే ఈ క్యాంపు ఏర్పాటు చేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి.

ఉమ్మడి జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన మరొకరు కూడా పోటీలో ఉన్నందున అతనికి కూడా ఓటు వేయాలని చెప్తారా లేక రెండో ఓటు నచ్చిన వారికి వేసుకునే నిర్ణయాన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వదిలేస్తారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ఓ వైపున అధికార పార్టీ తన ఓటు బ్యాంకు దారి మళ్లకుండా ఉండేందుకు క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాంపులోనే సుమారు 800లకు పైగా ఓటర్లు ఉండగా మరికొంతమంది అధిష్టానం అనుమతితో స్వస్థలాల్లో ఉన్నారు. మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు స్వతంత్రులుగా పోటీ చేస్తుండటమే సాహసోపేతంగా నిలుస్తోంది. ఈ క్రమంలో మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా క్యాంపులు ప్రారంభించారంటే తమ అభ్యర్థులు గెలిచేందుకు అండర్ గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తున్నారా లేక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు వ్యూహం రచించారా అని కూడా చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,324 మంది ఓటర్లలో ఎవరు మెజార్టీ ఓట్లు సాధిస్తారా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

కోవర్టులకు చెక్ పెట్టేందుకా.?

కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తరలించడం వెనుక ఆంతర్యం.. కోవర్టులకు చెక్ పెట్టేందుకే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులు దారి మళ్లకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ వేశారా అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా మారకుండా ఉండేందుకే ఈ వ్యూహం వేశారా అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఓట్లు తనకు వేయించుకునేందుకు పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసే క్యాంపులు ఏర్పాటు చేసి ఉంటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదీ ఏమైనా మంథని కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ మాత్రం సరికొత్త చర్చకు తెరలేపాయన్నది మాత్రం వాస్తవం.


Next Story