అక్కడ రేవంత్ ప్రమాణం.. ఇక్కడ బూతు పురాణం.. ఆడియో వైరల్

by  |
congress activist
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఏరా.. శ్రీధర్ బాబును మించినోడెవడ్రా అంటూ సోషల్ మీడియా ఇంఛార్జిపై కాంగ్రెస్ నాయకుడు ఒకరు మండిపడ్డ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దుర్భాషలాడుతూ ఆగ్రహించిన ఈ ఆడియో మంథని ప్రాంతంలో హల్ చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి దీపక్ జాన్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే పోస్టును మంథని కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి అరెల్లి కిరణ్ గౌడ్ మంథని ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ గ్రూప్‌ల్లో పోస్ట్ చేసి షేర్ చేశారు.

ఈ విషయాన్ని గమనించిన కిసాన్ సెల్ నాయకుడు తిట్ల పురాణం అందుకొని ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలాడాడు. మంథనిలో శ్రీధర్ బాబు కన్నా ముఖ్యమైన వారు ఎవరూ లేరంటూ రేవంత్‌తో పాటు దీపక్ జాన్‌లను కూడా తిట్టిపోశాడు. శ్రీధర్ బాబు ఇంటికి రారా.. ఆయన ముందే చెప్పుతో కొడుతానంటూ, ఇప్పటి నుంచి నువ్వు సోషల్ మీడియా ఇంఛార్జివి కావు. నిన్ను అన్ని గ్రూపుల్లో నుంచి తీయిస్తాను.. అంటూ మండిపడ్డారు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపున టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతల స్వీకరణకు హాజరైతే.. ఇక్కడి నాయకుడు మాత్రం సోషల్ మీడియా ఇంఛార్జిపై మండిపడ్డ ఆడియో లీక్ కావడం కలకలం సృష్టించింది.

Next Story

Most Viewed