MLC Elections: అధికార పార్టీలో కొత్త చర్చ.. అంతర్మథనంలో నేతలు

by  |
trs leader
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సవాల్‌గా మారిపోయాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా వారి పరిస్థితి తయారైంది. దీంతో మరోసారి ఏకగ్రీవం అయ్యేందుకు ప్రయత్నాలు చేయడంపై మీనామేషాలు లెక్కిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లోని సెకెండ్ కేడర్ ప్రజా ప్రతినిధులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో తమపై తీవ్రంగా పడుతుందన్న ఆందోళన లోలోపల ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నామినేషన్ వేసిన వారిని పోటీ నుండి తప్పించేందుకు ట్రై చేసేందుకు విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది.

గత అనుభవాలే..

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కావడంతో తమకు తీరని నష్టం వాటిల్లిందన్న ఆవేదన స్థానిక సంస్థల ప్రతినిధుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో తమ తమ పరిధిల్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించేందుకు ఎమ్మెల్సీలు సాహసించలేదని, అలాగే తమకు గుడ్ విల్ కూడా ఇవ్వలేదని ఇన్‌చార్జీల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికలప్పుడు భాను ప్రసాదరావు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఇన్‌చార్జీల ముందు కుండబద్దలు కొట్టారు. దీంతో వారిని సముదాయించే పరిస్థితి కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలకు లేకుండా పోయింది.

ఈసారి బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేసిన వారిని మెప్పించే, ఒప్పించే బాధ్యతలను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఏకగ్రీవం కోసం తాము ప్రయత్నిస్తే తమ తమ నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు దుమ్మెత్తిపోసే అవకాశాలు కూడా లేకపోలేదని విత్ డ్రాయల్స్ కోసం ట్రై చేయడం లేదని తెలుస్తోంది. బలవంతంగా బరిలో ఉన్న వారిని తప్పిస్తే తమకు చుక్కలు చూపిస్తారేమోనన్న ఆందోళన కొందరిలో వ్యక్తం అవుతుంటే, తమ నియోజకవర్గాలకు చెందిన స్థానిక నాయకులకు లాభం చేకూరుతుంది కదా అన్న యోచనలో కొందరు ఉన్నట్టుగా సమాచారం. ప్రత్యర్థులు బరిలో ఉంటేనే పార్టీ అభ్యర్థులు అన్ని విధాల సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తారు కానీ ఏకగ్రీవం అయితే రిక్త హస్తం చూపిస్తారన్న ప్రచారం విస్తృతంగా సాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

క్యాంపుల్లోనూ ఇదే చర్చ..

అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంపుల్లోనూ ప్రజా ప్రతినిధులు తమకు సరైన గుర్తింపు దొరకడం లేదన్న చర్చ తీవ్రంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. క్యాంపుల్లో చేరిన వారిలో కొంతమంది గతంలో కూడా స్థానిక సంస్థలకు ప్రాతినిథ్యం వహించిన వారు ఉండడంతో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు జరిగిన అన్యాయం గురించి వివరించడంతో ఇప్పుడు కూడా ఇలాగే చేస్తే ఎలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయాలన్నీ కూడా సెగ్మెంట్ ఇన్‌చార్జీల దృష్టికి రావడంతో స్పందించకపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో ఈ సారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం అధికార పార్టీ అభ్యర్థులకు సవాల్‌గా మారాయని స్పష్టం అవుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉచిత కంటి ఆపరేషన్ : ఎమ్మెల్యే ‘రేగా’ పిలుపు


Next Story