రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల సంగతేంటి?

by  |
రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల సంగతేంటి?
X

జైపూర్: రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అంతర్గతపోరుగా మొదలైన ఈ సంక్షోభం.. సచిన్ పైలట్ శిబిరంపై అనర్హత వేటు నోటీసులు, అనంతరం హైకోర్టుకు అటునుంచి సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. రెండు చోట్లా సచిన్ పైలట్‌కు ఊరట లభించడంతో సీఎం గెహ్లాట్ వేగాన్ని పెంచారు. మెజార్టీ మార్కుకు మించిన బలమున్నదని ప్రకటించిన ఆయన బల పరీక్షకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని గవర్నర్‌ను కోరనున్నట్టు తెలిపారు.

ఫ్లోర్ టెస్టుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కోరామని, కానీ ‘పై నుంచి’ వస్తున్న ఒత్తిడితో ఆయన నిరాకరించారని వివరించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను రాజ్‌భవన్ వెళ్లి కలవనున్నట్టు వెల్లడించారు. అయితే, ఈ క్రమంలో ప్రజలు రాజ్‌భవన్‌ను గెరావ్ చేస్తే తమ బాధ్యత కాదని అన్నారు. ఈ రాజకీయ సంక్షోభం తన ప్రభుత్వం వల్ల కాదనీ, పైలట్, అతని సహచర బృందం గొంతెమ్మ కోరికలతోనే ఏర్పడిందని విమర్శించారు. తనకు సంపూర్ణ మెజార్టీ ఉన్నదని పునరుద్ఘాటించారు.

రెబల్స్‌కు తాను జారీ చేసిన అనర్హత నోటీసుల్లో జోక్యం చేసుకోరాదని, అందుకే రాజస్థాన్ హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని స్పీకర్ సీపీ జోషి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని సచిన్ పైలట్‌కు కోర్టు ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును నిలుపుదల చేయబోమని, హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తుందని(ఈ నెల 27న!) తెలిపింది.

కాగా, శుక్రవారం(నేడు) ఈ నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సచిన్ పైలట్ వర్గంపై అనర్హత నోటీసులపై ఇప్పుడే చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. అంతేకాదు, తమపై ఫిరాయింపు చట్టం వర్తిస్తుందా? లేదా? నిర్ణయించడంపై ఈ కేసులో కేంద్రప్రభుత్వాన్ని చేర్చుకోవాలని సచిన్ పైలట్ వర్గం చేసిన చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతీ, జస్టిస్ ప్రకాశ్ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం అభ్యర్థనను స్వీకరించింది. దీంతో స్పీకర్ సీపీ జోషి నోటీసులపై యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తీర్పును వాయిదా వేసింది.



Next Story

Most Viewed