‘దళితబంధు’ అందరికీ అందుతుంది.. కలెక్టర్ హామీ

by  |
Suryapeta Collector Vinay Krishna Reddy
X

దిశ, తుంగతుర్తి: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అందరికీ అందుతుందని సూర్యాపేట కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలోని తిరుమలగిరి మండలం తాటిపాముల, తొండ గ్రామాలతోపాటు తిరుమలగిరి మున్సిపాలిటీలోని 5,6 వార్డులలోని దళితులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ దళిత కుటుంబానికి తప్పక ‘దళితబంధు’ అందుతుందని అన్నారు. దళితులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా బలపడాలని కోరారు. అందరి ఇళ్లకు అధికారులు వచ్చి పలు సూచనలు చేస్తారని తెలిపారు. రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉన్నా.. లేకున్నా అధికారులే స్వయంగా వాటిని సమకూరుస్తారని అన్నారు. ‘దళితబంధు’ కోసం దళారులను ఆశ్రయించవద్దని సూచించారు.

వలస వెళ్లిన ఈ మండల వాసులు ఎవరైనా తిరిగొచ్చి ఇక్కడే ఉంటామంటే వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు డబ్బులను కేవలం వ్యాపార పరంగానే వాడుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజనీ రాజశేఖర్, తాటిపాముల సర్పంచ్ ఎర్ర శోభాశ్రీనివాస్, తొండ సర్పంచ్ శాతవాహన రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎంపీడీవో ఉమేష్ చారి, కమిషనర్ దండు శీను, వార్డు కౌన్సిలర్ శ్రీలత, కందుకూర్ లక్ష్మయ్యతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed