వకీల్‌పల్లి గనిలో కుప్పకూలిన పైకప్పు

by  |
వకీల్‌పల్లి గనిలో కుప్పకూలిన పైకప్పు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సింగరేణి భూగర్భ గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గల్లంతు కాగా, మరో ముగ్గురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వకీల్‌పల్లి బొగ్గు గనిలో 41డీప్ 65వ లెవల్ జంక్షన్ వద్ద పైకప్పు కూలడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే ఓవర్ మెన్ కార్మికుడు బొగ్గు పొరల కింద కూరుకు పోయాడు. మరో జనరల్ మజ్దూర్ కార్మికుడు సతీష్ గాయపడగా సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద పై కప్పు కూలే ముందు శబ్దం రావడంతో మరో ఇద్దరు కార్మికులు కూడా సేఫ్‌గా బయటపడ్డారు. ఓవర్ మెన్ నవీన్ కోసం రెస్యూ టీం రంగలోకి దిగి గాలింపు చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యం రక్షణ చర్యలు పాటించక పోవడం వలన ప్రమాదం జరిగిందని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద ఘటనపై డైరెక్టర్ జనరల్ మైన్ సేఫ్టీ విభాగంతో విచారణ జరిపించాలని కోరుతున్నారు.

మూడు మాసాల క్రితమే..

మైన్‌లో శిథిలాల కింద కూరుకపోయిన ఓవర్ మెన్ నవీన్‌కు మూడు నెలల క్రితమే వివాహం అయింది. 2015బ్యాచ్‌కు చెందిన ఆయన మైన్‌లో పనిచేస్తున్న క్రమంలో రూఫ్ నుండి శబ్దం వస్తుండడంతో అదేంటో చూడాలని సూచించడంతో మిగతా కార్మికులు అక్కడకు వచ్చి చూసే సరికి రూఫ్ నుండి పెల్లల్లు పడుతున్న విషయాన్ని గమనించి వాటిని తప్పించుకుంటూ బయటకు వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన నవీన్ కూడా బయటకు వస్తున్న క్రమంలో ఆయనపై భారీ స్థాయిలో పెల్లలు పడిపోవడంతో వాటి కింద కూరుకపోయాడు.



Next Story

Most Viewed