విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ఇబ్బంది రావొద్దు

by  |
విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ఇబ్బంది రావొద్దు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ట్రాన్స్ కో‌, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ పరిస్థితిపై ప్రభాకర్‌రావు సోమవారం హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేయాలని కోరారు. నీట మునిగిన ప్రాంతాలు, గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరా ఆపివేయాలని, ముంపు తొలగిన వెంటనే సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తాయని, కరీంనగర్‌ జిల్లాలో 220కేవీ సామర్ధ్యం కలిగిన ఏడు టవర్లు భారీ వరదల వల్ల కొట్టుకుపోయాయన్నారు. వరంగల్‌ జిల్లాలో రెండుచోట్ల 33 కేవీ సబ్‌స్టేషన్‌లు నీట మునిగినప్పటికీ ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 54 గ్రామాలు నీట మునిగి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌సరఫరాను నిలిపివేసినట్టుచెప్పారు. వరద నీరు నిండిన ప్రాంతాలకు సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో 159, ఎన్పీడీసీఎల్ పరిధిలో 89మొత్తం 248 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్‌ సరఫరాను ముందు జాగ్రత్త చర్యగా నిలిపి వేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు ఉన్నందున అప్పర్‌ జూరాల, లోయర్‌ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లలో మొత్తం 1200 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గినందున కేటీపీఎస్, సింగరేణి తదితర ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించినట్టు సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.


Next Story