బీజేపీని ఇరుకున పెట్టడమేనా?

by  |
బీజేపీని ఇరుకున పెట్టడమేనా?
X

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ‘యూ టర్న్’గా కనిపిస్తున్నా దీని వెనక బహుముఖ వ్యూహమే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంతిని బీజేపీ కోర్టులోకి విసిరే వ్యూహం, దూరమవుతున్న ప్రజలను తిరిగి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ఇందులో దాగి ఉన్నాయని అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ విమర్శలకు తావు లేకుండా ఉండేలా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికులు జరుగునున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నింటినీ ఒక్కటొక్కటిగా చక్కదిద్దే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, ఉద్యోగులకు జీతాల పెంపు వరాలు, సామాన్యులకు ఎల్ఆర్ఎస్ మినహాయింపు అన్నీ అందులో భాగమే. ప్రస్తుతం బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించింది. తక్షణం ఆ పార్టీ దూకుడును అడ్డుకోవాలంటే కాస్త కూల్ చేయాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఆ పార్టీ లేవనెత్తుతున్న అంశాలపై సీఎం కేసీఆర్ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇకపైన విమర్శించడానికి ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పోవాలంటూ బీజేపీ ప్రచారం చేసింది. ఆ అవకాశమే లేకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగువేసింది. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు కూడా ఆ కోవలోనివే. రానున్న కాలంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే విద్యుత్ సంస్కరణలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనకబడినవర్గాలకు ప్రత్యేక కోటాలాంటి మరికొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం ఉంది.

బీజేపీ నోటికి తాళం

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రభుత్వంపై, టీఆర్ఎస్‌పై బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా పార్టీ నాయకత్వం పెద్దగా స్పందించలేదు. పలితాల అనంతరం ఆలోచనలో పడింది. ప్రజల నాడి అర్థమైంది. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావు, బండి సంజయ్ లాంటి చాలా మంది నేతలు, నాయకులు ఆయుష్మాన్ భారత్, వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఇప్పుడు యువత, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా ప్రజలకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలను కేసీఆర్ తీసుకోవడంతో బీజేపీ కొత్త అంశాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీజేపీ నిర్దిష్ట వైఖరి తీసుకుంది. ఒక్కో సమస్యపై ఆయా సెక్షన్ల ప్రజలను కదిలించి రోడ్లమీదకు తెచ్చి ఆందోళనలకు ప్లాన్ వేసింది. వీటికి బ్రేక్ వేసేలా సీఎం నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ తన ప్లాన్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

వారి వేలుతో వారి కన్ను

కేంద్ర చట్టాలను తెలంగాణ సర్కారు అమలుచేయకపోవడంతో పేదలకు ప్రయోజనం అందడంలేదని బీజేపీ ఇంతకాలం విమర్శించింది. వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నా ఢిల్లీ పర్యటన తర్వాత నిర్ణయం మార్చుకుని కేంద్రానికే జై కొట్టారు. ఈ విధానంతో రైతులలో ఇకపైన వ్యతిరేకత వస్తే దానికి కేంద్రమే జవాబుదారీ అనే అభిప్రాయం నెలకొంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ దోషిగా నిలబడుతుంది. కేంద్ర చట్టాలు రానంతవరకూ సంతృప్తి ఉందని, వాటిని అమలుచేయడం ద్వారానే ఇప్పుడు అశాంతి నెలకొనిందని టీఆర్ఎస్ ప్రచారం చేసుకోడానికి మార్గం సుగమం అవుతుంది. బీజేపీని ఎక్కడా విమర్శించకుండా రైతుల ద్వారానే కాగల కార్యాన్ని సాధించాలనుకుంటున్నారు. వారి కన్నును వారి వేలుతోనే పొడిపించే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు.

విద్యుత్ సంస్కరణలు కూడా?

దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, మంత్రి హరీశ్‌రావు మధ్య విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ మోటారు పంపెసెట్ కనెక్షన్లకు మీటర్లను బిగించే అంశంపై ఘాటుగానే విమర్శలు సంధించుకున్నారు. మీటర్లు పెడితే ఇక ముక్కు పిండి ప్రతీ నెలా బిల్లులు వసూలు చేస్తారని కేంద్రం తీరును హరీశ్ రావు వారి అర్థమయ్యేలా వివరించారు. ఇప్పుడు బీజేపీ నేతలు దాని గురించి చర్చ లేవనెత్తితే, కేంద్రానికి అనుకూలమైన నిర్ణయాన్నే తీసుకుని మరోసారి నోరెత్తకుండా చేసే అవకాశమూ లేకపోలేదు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, పార్లమెంటులో చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించినా చివరకు కేసీఆర్ అనుకూలమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. విద్యుత్ సంస్కరణల విషయంలోగానీ, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్‌పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్), ఎన్ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) తదితర అంశాలలోనూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేసింది. అయినా బీజేపీ నుంచి ఈ అంశాలపై వచ్చే విమర్శల స్థాయికి అనుగుణంగా అవసరమైతే వాటి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని నోరు మూయించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఆర్థిక అవసరాలు కూడా!

కరోనా పరిస్థితులలో ప్రభుత్వానికి స్వీయ ఆదాయ వనరులు గణనీయంగా తగ్గిపోయాయి. అనివార్యంగా అప్పులు చేయక తప్పడంలేదు. కేంద్రం నుంచి హెలికాప్టర్ మనీ లాంటివి వస్తాయని ఆశించినా అది అడియాసగానే మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితులలో కేంద్రం దారిలో నడవడం ద్వారా రోజువారీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చన్న అంశం కూడా ఈ వ్యూహంలో కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేసినట్లయితే దాని ద్వారా కనీసంగా రూ. 250 కోట్లు రాష్ట్రానికి అందే వీలు ఉన్నందున ఆ మేరకు ఆరోగ్యశ్రీ పథకానికి ‘వేడినీళ్ళు-చన్నీళ్ళ’ తరహాలో ఉపయుక్తంగా ఉంటుందనేది ప్రభుత్వ భావన. ఇకపైన అలాంటి ఆర్థిక వనరులు ఒనగూరే పథకాలకు జై కొట్టడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని సమాచారం. రానున్న కాలంలో మరిన్ని ‘యూ టర్న్’ నిర్ణయాలు ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి.



Next Story