కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పర్యటన..?

by Shyam |   (  Updated:2021-06-03 20:33:34  IST  )

<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారా..? నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారా..? ఆయన వస్తున్నట్టు సంకేతాలిచ్చారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడం, కలెక్టర్, పోలీసు కార్యాలయాల భవన నిర్మాణ పనులపై వివరాలు అడిగి తెలుసుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రారంభోత్సవ కార్యక్రమానికి [&hellip;]</p>

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పర్యటన..?
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారా..? నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారా..? ఆయన వస్తున్నట్టు సంకేతాలిచ్చారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడం, కలెక్టర్, పోలీసు కార్యాలయాల భవన నిర్మాణ పనులపై వివరాలు అడిగి తెలుసుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తానని సంకేతాలు కూడా ఇవ్వడంతో దాదాపు సీఎం పర్యటన ఖరారైనట్టుగానే తెలుస్తోంది. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టడం కోసం ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

నూతన జిల్లా ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లాల పునర్విభజన చేపట్టారు. అందులో భాగంగా డివిజన్ కేంద్రంగా ఉన్న కామారెడ్డి 2016 అక్టోబర్ 11న జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. నూతన జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలకు భవనాలు లేకపోవడంతో మైనారిటీ గురుకుల పాఠశాల భవనంలో కలెక్టరేట్, గిరిజన బాలుర వసతి గృహం భవనంలో జిల్లా పోలీసు కార్యాలయాలు కొనసాగుతున్నాయి.

నూతన భవనాలకు శంకుస్థాపన

కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పాటైన సరిగ్గా ఏడాదికి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శాశ్వత భవనాల ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టింది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని అడ్లూరు, ఇల్చిపూర్ శివారులో రెండు కార్యాలయాల భవనాల నిర్మాణాలకు అధికారులు స్థలాన్ని గుర్తించారు. 2017 అక్టోబర్ 17 న నాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా 51.71 కోట్ల వ్యయంతో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చకచకా కొనసాగిన పనులు

నూతన భవనాల కోసం శంకుస్థాపన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా కామారెడ్డి జిల్లాలోనే భవన నిర్మాణానికి పనులు వేగిరంగా సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు తొందరగా జరిగేలా చూసారు. కానీ నిధుల కొరతతో కొద్దిరోజుల పాటు పనులు మందకొడిగా సాగాయి. దాంతో రాష్ట్రంలోనే మొదటి సారిగా ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన పనులు వెనకబడ్డాయి. ఎట్టకేలకు పనుల్లో వేగం పుంజుకుంది. దాదాపుగా ప్రారంభోత్సవానికి భవనాలు సిద్ధమయ్యాయి.

సీఎం చేతుల మీదుగా

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కార్యాలయాలను ప్రారంభం జరుగుతాయని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఆ కల నెరవేరుతుందా లేదా అని అందరూ భావించారు. ప్రస్తుతం అటువంటి అనుమానాలకు తావు లేకుందాం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు స్వయంగా సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం ఫోన్ చేసి కలెక్టరేట్, పోలీసు కార్యాలయల పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రారంభోత్సవానికి స్వయంగా తానే వస్తానని సంకేతాలు పంపారు. దాంతో సీఎం పర్యటన దాదాపుగా ఉంటుంది అని అందరూ అంచనాకు వచ్చారు.

సీఎం రాక కోసం

గత మూడేళ్ళ క్రితం 2018 లో జరిగిన ఎన్నికల సమయంలో ప్రచారం నిమిత్తం సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చారు. దాని తర్వాత ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమాలు ఏవి జరగలేవు. ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని, జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. మరోసారి సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ పనుల పరిశీలన

సీఎం కేసీఆర్ పర్యటన సందర్బంగా జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులను గురువారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమార్ పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్, ఇతర కార్యాలయ సముదాయాలు, గార్డెనింగ్, రహదారులను ప్రభుత్వ విప్ పరిశీలించారు. అక్కడక్కడ కొన్ని పనులు అసంపూర్తిగా ఉండటంతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

Next Story